చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే కసరత్తులను ప్రారంభించాయా? మళ్లీ అధికారం సాధించాలని టిఆర్ఎస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలని బిజెపి, కాంగ్రెస్ లు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయా? తెలంగాణ రాష్ట్రంపై పట్టు సాధించడం కోసం ప్రత్యర్థి పార్టీలలో ఇమడలేని నేతలను టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తులు .. ట్రాప్ చేసే పనిలో బీజేపీ, కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీల నుండి చాలామంది కీలక నేతలను కారు ఎక్కించారు. అయితే టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు, మధ్యలో కారెక్కిన నేతలు అందరూ కలిసి ప్రయాణం సాగించడం అనేక జిల్లాలలో కష్టంగా మారింది. కారు ఓవర్ లోడ్ అయ్యింది. అధికార పార్టీలో ఏదైనా పదవి దక్కుతుందని ఆశపడి పార్టీలో చేరిన చాలా మంది నేతలు పదవులు దక్కని పరిస్థితులలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక మధ్యలో వచ్చిన నేతలకు పదవులు వస్తే, మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటువంటి అసంతృప్తులను ట్రాప్ చేసే పనిలో పడ్డాయి కాంగ్రెస్, బిజెపిలు.

కారు దిగి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దంపతులు కాంగ్రెస్ లో చేరిక
తాజాగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఓదెల దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ తో విభేదాల కారణంగా టిఆర్ఎస్ పార్టీలో ఇమడలేక నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది.

పార్టీలో చేరికలకు సైలెంట్ గా ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి
ఓదెలు పార్టీలో చేరే వరకు కూడా బయటకు ఎటువంటి సమాచారం లేకుండా పక్కా ప్లాన్ తో రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకు వెళ్లారు. ఇక చేరికల విషయంలో తన ప్లాన్ బయటకు రానీయకుండా జాగ్రత్తగా టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను, గతంలో పార్టీని వీడి వెళ్లిన ముఖ్య నేతలను మళ్లీ పార్టీలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తాను ఎవరితో మాట్లాడుతున్నాను అనే విషయాన్ని కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు రేవంత్ రెడ్డి.

చేరికలకు బీజేపీ వ్యూహాలు ... ఇంకా చర్చలు, సంప్రదింపుల వద్దనే ఉన్న బీజేపీ
ఇదిలా ఉంటే అటు బీజేపీ సైతం పార్టీలో చేరికలకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర సమయంలోనే పెద్ద ఎత్తున బీజేపీ లో చేరికలు ఉంటాయని చెప్పినప్పటికీ, పార్టీలో ఎవరూ చేరిన పరిస్థితి కనిపించలేదు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి ఇలా కొందరు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న వారిని బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందే కీలక నేతలను బిజెపిలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికలకు బలంగా ముందుకు వెళ్లవచ్చని బిజెపి భావిస్తోంది. బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

చేరికలకు భారీ స్కెచ్ వేసిన టీఆర్ఎస్
ఇదిలా ఉంటే ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెడుతూ అధికార టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులను సర్పంచి స్థాయి మొదలుకొని, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి వరకు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. అధికార పార్టీ లోకి వస్తే అనుకున్న పనులు చేసుకోవచ్చని వారిని ప్రలోభానికి గురిచేసి పార్టీ తీర్థం పుచ్చుకునేలా చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టడం కోసం వ్యూహాత్మకంగా టిఆర్ఎస్ పార్టీ చేరికలను ఎంచుకుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ వంటి ముఖ్యమైన జిల్లాలలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేరికలకు నానా తిప్పలు పడుతున్నారు. రండి బాబు రండి అంటూ ప్రత్యర్ధి పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు.

ఏ పార్టీలో చేరికలు ఉంటే ఆ పార్టీకే మైలేజ్ .. ఎవరు సక్సెస్ అవుతారో?
ఏ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయో ఆ పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా చేరికలతో ప్రత్యర్ధి పార్టీలు బలహీనపడతాయని భావిస్తున్నాయి. చేరికలతో ప్రజాదరణ ఆ పార్టీకి ఉన్నట్టు ప్రజాక్షేత్రంలో చూపించే వీలుంటుందని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు చేరికల వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. మరి ఈ వ్యూహంలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.