తెలంగాణ రాజ్ భవన్ పేరు తొలగింపు..!!
తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ పేరు మారింది. ఇకపై లోక్ భవన్ గా దీన్ని పిలుస్తారు. కొత్త పేరును మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఇకపై ఇది లోక్ భవన్ గా కొనసాగుతుంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం తమ గవర్నర్/లెఫ్టినెంట్ గవర్నర్‌ల నివాసాల పేర్లను మార్చనున్నాయి.
రాజ్ భవన్ అనేది వలసవాద కాలం నాటి రోజులను గుర్తు చేస్తోందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వాటిని ప్రతిబింబించే ఉన్న పేర్లన్నింటినీ కూడా క్రమంగా తొలగిస్తూ వస్తోంది. దేశ వలసవాద వారసత్వాన్ని వీడాలనే లక్ష్యంతో పలు మార్పులు చేపట్టింది. గతంలో రాజ్ పథ్‌ను 'కర్తవ్యపథ్'గా మార్చడం, అధికారిక కార్యకలాపాల్లో 'ఇండియా' బదులు 'భారత్' వినియోగం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే- ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా మొదట హిందీలో కంటెంట్‌ను ప్రదర్శిస్తాయి. బీటింగ్ రిట్రీట్ వేడుకల్లోనూ ఇంగ్లీష్ ప్రార్థనా గీతాలకు పుల్ స్టాప్ పడింది.

ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా 'రాజ్ భవన్/రాజ్ నివాస్' అనే పేర్లను దశలవారీగా తొలగిస్తూ వస్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. దీనికి బదులు వాటికి 'లోక్ భవన్/లోక్ నివాస్' అని కొత్త పేర్లు పెడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందని భావిస్తోంది. రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చాలని గత ఏడాది నిర్వహించిన గవర్నర్ల సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది.
దీనిపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యదర్శులకు లేఖలు పంపింది. అధికారిక కార్యకలాపాలకు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాలకు వరుసగా లోక్ భవన్, లోక్ నివాస్ అని పేరు పెడుతున్నారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిశా, గుజరాత్, త్రిపురల్లోని రాజ్ భవన్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ నివాస్ ను లోక్ నివాస్ గా మార్చారు.












Click it and Unblock the Notifications