తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం.. పని వేళలు పొడిగింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విపరీతంగా పెరిగిన రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ల పనివేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలలో భూముల కొనుగోలు, అమ్మకాలు పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారతాయి. అయితే ఈ నెల 31తో ఫైనాన్షియల్ ఇయర్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోపు తమ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
ఈ నెల 28, 30 , 31 తేదీలలో అన్ని కార్యాలయాలు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తాయని కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.. సాధారణంగా సాయంత్రం 5:00 గంటలకే ముగిసే పని వేళలను ఇప్పుడు రాత్రి వరకు పొడిగించడం వల్ల పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ఆర్థిక ఏడాది ముగియకముందే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలను వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. స్లాట్లు బుక్ చేసుకున్న వారు నిర్ణీత సమయానికి కార్యాలయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో స్లాట్లు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనిని పరిష్కరించడానికి సర్కారు స్లాట్ల సంఖ్యను కాడా పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమకు వీలైన సమయంలో స్లాట్ బుక్ చేసుకుని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మరో వైపు ఈ నెల 28, 30 , 31 తేదీలలో సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. పెరిగిన పని వేళలకు అనుగుణంగా సిబ్బంది అందుబాటులో ఉండి.. ప్రజలకు సేవలు అందించాలని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications