స్థిరాస్తి రంగం జిగేల్... మూడు రోజుల్లో రూ.100 కోట్లు
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దత నుంచి తేరుకుంది. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు దాదాపు రూ.100 కోట్లకుపైగా ఆదాయం లభించింది.
హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దత నుంచి తేరుకుంది. కేంద్రం నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది.
అమ్మకాలు, కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ఆ దెబ్బ నుంచి ఈ రంగం క్రమేణా కోలుకుంటోంది. ముఖ్యంగా మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు దాదాపు రూ.100 కోట్లకుపైగా ఆదాయం లభించింది.

ఈ మూడు రోజుల్లోనే...
గతంతో పోల్చితే.. ఇది భారీ పెరుగుదలే. ఏటేటా నమోదయ్యే సగటుతో పోల్చితే ఒక రకంగా ఇది రికార్డు కూడా. భూ రిజిస్ట్రేషన్ల తీరుతెన్నులు గమనిస్తే ఈ వారంలో.. ఒక్క సోమవారం రోజే భూముల క్రయ, విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.50 కోట్ల రాబడి వచ్చింది.

ముందు వరుసలో రంగారెడ్డి, మేడ్చల్...
తరువాతి రోజైన మంగళవారం దాదాపు రూ.25 కోట్లకుపైగా రాబడి రాగా.. బుధవారం మరో రూ.25 కోట్ల వరకు వసూలైంది. మొత్తంమ్మీద 10 శాతం వరకు డాక్యుమెంట్లు పెరిగాయి. ఈ రాబడిలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.

జిల్లా కేంద్రాల్లో కూడా...
వీటికి తోడు కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా భూముల క్రయ విక్రయాలు జోరందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు శుభవార్తే. అంటే రిజిస్ట్రేషన్ ఆదాయ వనరులు పెరుగుతున్నాయన్న మాట.

నోట్లరద్దు తరువాత డీలా...
నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రుసుముల ద్వారా ప్రభుత్వానికి రోజుకు రూ.15 కోట్ల వరకు రాబడి వచ్చేది. నోట్ల రద్దు తరువాత అది రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు పడిపోయింది.

క్రమేణా కోలుకుంటూ...
ఆ తరువాత క్రమంగా నోట్ల రద్దు ప్రభావం నుంచి అన్ని రంగాలు కోలుకోసాగాయి. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కాస్త ఆలస్యంగా తేరుకుంది. క్రమేణా క్రయ విక్రయాలు పుంజుకుంటున్నాయి.

త్వరపడుతున్న కోనుగోలుదారులు...
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి - ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడం, రెండు - వచ్చే నెల నుంచి రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీలు జరుపరాదని ఆదాయ పన్ను శాఖ నిబంధన విధించడం. కొనుగోలు దారులు త్వరపడుతుండడం కూడా ఈ పెరుగుదలకు కారణమై ఉండొచ్చు.

జోరు కొనసాగుతుందా?
ఏప్రిల్ 1 తరువాత వచ్చే రూ.2 లక్షల నిబంధన వల్ల ఈ జోరు ఇలాగే కొనసాగుతుందా.. లేదా? అనేది ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీల విషయంలో ప్రజల్లో కొంత అవగాహన పెరగడం వల్ల రూ.2 లక్షల నిబంధన ప్రభావం భారీగా ఉండకపోవచ్చనని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications