అమ్మి10వేలకోట్లు: కేసీఆర్ ప్లాన్, బాబు ఇంటితో చిక్కు
హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్న పలు ప్రభుత్వ భవనాలను వేలం వేయాలని కే చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలా భవనాలు ప్రధాన కూడళ్లలో ఉన్నాయని, వాటిని వేలం వేయడం ద్వారా డబ్బు ఎక్కువగా సమకూరుతుందనే ఆలోచన చేస్తోందంటున్నారు.
వీటిని వేలం వేసి అతిథి గృహాలను, ఇతర కార్యాలయాలను నగరం ఔట్ స్కర్ట్స్‌లలోని గచ్చిబౌలి, కొత్తగా కట్టే వాటిలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా లేక్ వ్యూ అతిథి గృహాన్ని కూడా అమ్మే యోచనలో ఉందని సమాచారం.
అయితే, దానిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్నారు. దీనిని ఏపీ సీఎంకు క్యాంప్ ఆఫీస్ కోసం కేటాయించారు. ఈ నేపథ్యంలో దీనిని అప్పుడే వేలం వేస్తే విమర్శలు వచ్చే అవకాశాలుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉన్న కార్యాలయాలను వేలం వేసి.. వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఒకే ప్రాంతంలో దాదాపు అన్నింటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఆ డబ్బులతో కొనే మరికొంత భూమిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం, మిగతా దానిని పేద దళితులకు ఇచ్చే 2 బెడ్ రూం కోసం ఖర్చు చేయాలని యోచిస్తున్నారంటున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. మొత్తం పది జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న భవనాల వేలం ద్వారా రూ.10వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వేలం వేయడానికి అనుకూలంగా ఉన్న భవంతులను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భవనాలు, భూముల అమ్మకం ద్వారా రూ.3,250 కోట్లు, కరీంనగర్‌లో రూ.2,480 కోట్లు, వరంగల్‌లో రూ.2,270 కోట్లు, మెదక్‌లో రూ.1,380 కోట్లు, పాలమూరులో రూ.640 కోట్లు, హైదరాబాదులో రూ.225 కోట్లు, నిజామాబాదులో రూ.120 కోట్లు, అదిలాబాదులో రూ.50 కోట్లు, ఖమ్మంలో రూ.25 కోట్లు, నల్గొండలో రూ.10 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications