ఇక తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్ అమలు: కరోనాకు ఉచిత చికిత్స
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ గత ఏడాది నుంచి నలువైపుల నుంచీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో.. ఆ మహమ్మారికి ఉచిత చికిత్స అందిస్తున్న ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్(ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన) పథకం.. ఇకపై తెలంగాణలోనూ అమలు కానుంది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రంతో రాష్ట్ర ఒప్పందం..
ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. నిబంధనల మేరకు వైద్య సేవలు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమల్లోకి వస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్
కాగా, ఆయుష్మాన్ భారత్ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు. అయితే, అంతకుముందు ఆగస్టులోనే హర్యానాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అనే బాలికను ఈ పథకం లబ్దిదారుగా పేర్కొంది. ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు చికిత్స ఉచితం. దీని కింద దేశ వ్యాప్తంగా 20వేలకుపైగా ఆస్పత్రుల్లో కరోనాతోపాటు 1000కిపైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. కాగా, తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలంటూ బుధవారం బీజేపీ నేతలు దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications