తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు: స్త్రీ, పురుష నిష్పత్తి ఎంతంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషన్ వెల్లడించింది. వీరిలో పురుష ఓటర్లు 1,58,71,493 కాగా.. మహిళా ఓటర్లు 1,58,43,339గా ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,557గా ఉన్నారు.
జనవరితో పోలిస్తే 5,8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 17.01 లక్షల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 998:1000గా ఉంది.

ఓటర్ల తుది జాబితా వివరాలు :
పురుషులు ఓటర్లు 1,58,71,493
మహిళలు ఓటర్లు 1,58,43,339
ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,557
సర్వీసు ఓటర్లు 15,338
ప్రవాస ఓటర్లు 2,780
మొత్తం 3,17,17,389
మరోవైపు ఈ ఎన్నికల్లో 80 ఏళ్లు పై బడిన వయోవృద్ధులు ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇంటి వద్ద నుంచే ఓటుహక్కును వినియోగించుకునే 80 ఏళ్ల పైబడిన వృద్ధులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాల్సి ఉంది. ఈ విధానాన్ని వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచి అమలు చేయనున్నట్లు సీఈసీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం వీరు రాష్ట్రంలో 4,87,950 మంది ఉన్నారు.
ఈసారి ఎన్నికల్లో ఓటర్ల జాబితాకు సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్ ఈఆర్పీ నెట్ 2.0ను తీసుకువచ్చారు. దీని పనితీరు, ఇబ్బందులపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్షించింది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఈసీఐ బృందం పేర్కొంది. కర్ణాటక ఎన్నికల నిర్వహణ ఏ రకంగా చేశారనే విధానంపై ఈసీ అధ్యయనం చేయనుంది.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, వివిధ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటన గురువారంతో ముగియనుంది.












Click it and Unblock the Notifications