తెలంగాణ దుస్థితి: కౌలు రైతులకు మొండిచేయి, దళితులకు భూసేద్యం అందని ద్రాక్ష?
తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు కావస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తమ వాటా కోసం ఏళ్ల తరబడి సాగిన ఉద్యమ ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది.
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు కావస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తమ వాటా కోసం ఏళ్ల తరబడి సాగిన ఉద్యమ ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. స్వప్పాన్ని సాకారంచేసిన ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ అభ్యున్నతి దిశగా ముందుకు సాగుతుందని అంతా ఆశించారు. రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నాలుగు దశల్లో అమలుచేసింది.
కానీ పట్టాదార్లు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేసిన సర్కార్.. కౌలు రైతుల సంగతే మరిచిందని వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. తాగునీటి వసతుల కల్పన ప్రక్రియ ఇంకా అమలులో ఉన్నది. పేదవాడి ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రభుత్వ ఖర్చులతోనే 'డబుల్ బెడ్ రూం ఇల్లు' నిర్మించి ఇస్తామన్నహామీ ఇంకా పొత్తిళ్లలోనే మగ్గుతున్నది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని కౌల్దారీ విధానం పెరుగుతుండటం తీవ్ర పరిణామమని 'తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక-2017' పేర్కొన్నది.
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవెలప్‌మెంట్ మండలి (సీఎస్‌డీ) డెరైక్టర్ కల్పనా కన్నాబిరాన్ సారథ్యంలో పద్మినీ స్వామినాథన్, జయరంజన్ రూపొందించిన ఈ నివేదిక ఈ నెల 12న విడుదల కానున్నది. జాతీయ నమూనా సర్వేతోపాటు 2011 జన గణన వివరాలతో సరిపోల్చి రూపొందించిన ఈ నివేదికలో మౌలిక వసతులు మొదలు పంటల సేద్యం, వివిధ పథకాల అమలుతో సామాజికంగా తెలంగాణలో వచ్చిన మార్పుల వివరాలు వెలుగులోకి తెచ్చారని తెలుస్తోంది.

పెట్టుబడులకు కౌలు రైతుల అవస్థలిలా
కౌలు రైతులు ఎలాంటి గుర్తింపు లేక, ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పంటబీమా, ఎరువులు, రాయితీతోకూడిన పెట్టుబడి పథకాలేవీ దక్కక కౌలు రైతులు పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నది. రాష్ట్రంలో సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో 65.5 శాతం భూమి కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నదని, వారంతా సన్న, చిన్నకారు రైతులేనని వ్యవసాయ సంక్షోభంతో రైతులు అత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో సాగు యోగ్యత, కౌలు సంబంధిత అంశాలపై ప్రభుత్వం అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. తాజాగా 2018 - 19 నుంచి ఎరువుల పెట్టుబడి కింద రెండు సీజన్లకు కలిపి ప్రతి రైతుకు రూ.8000 ఆర్థిక సాయం ఆయా రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కౌలు రైతుల సమస్యలు ప్రత్యేకించి వారికి రుణ పరపతి, ఇతర రాయితీల కల్పన అంశాన్ని విస్మరిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దళితులకు మూడెకరాల భూమి ఫలాలిలా
దళిత, గిరిజనులకు జీవనోపాధి, ఆహారభద్రతకు సేద్యమే కీలకం. 43.3 శాతం గ్రామీణ కుటుంబాలకు భూమే లేదు. ఇతర వెనుకబడిన వర్గాలతో పోలిస్తే వీరికి భూ వనరులు తక్కువగా ఉన్నాయి. గిరిజనుల్లో 75 శాతం మందికి రెండున్నర ఎకరాల్లోపే భూమి ఉంది. వీరి పంటల సాగు, నీటివసతి, పశు సంపద కూడా తక్కువే. 2014లో తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా దళితులకు మూడెకరాల పట్టాభూమి పంపిణీ పథకం అమలు చేస్తామని ప్రకటించింది. పూర్తి వసతులు కల్పిస్తామని నమ్మ బలికింది. కానీ ఈ నివేదికలో మాత్రం ఎన్ని దళిత కుటుంబాలకు సేద్యానికి భూ వసతి కల్పించిదన్న సంగతి మాత్రం పేర్కొనలేదు. బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేస్తున్న పంట రుణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. సాగునీటి వసతి దళితులకు 25.4%, గిరిజనులకు 29.9%, ఇతరులకు 36.9%గా ఉంది. వ్యవసాయ అవసరాల కోసం తవ్వే బావులు, బోర్లతో తెలంగాణలో దాదాపు 70 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారు. తర్వాత వారిలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడేందుకు కారణం అవుతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలు 90% అప్పుల్లో ఉన్నాయి.

అత్యధికులకు పీడీఎస్ దూరం
తెలంగాణలో అత్యంత అల్పాదాయ వర్గాలకు ప్రజా పంపిణీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. 20% ఎస్సీ కుటుంబాలకు అసలు రేషన్‌కార్డులే లేవు. అత్యంత నిరుపేదలు కార్డులను పొందడం దుర్లభంగా ఉంది. అర్హులకు వెంటనే రేషన్ కార్డు ఇతర వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా.. ఆచరణలో జరుగుతున్నది అందుకు విరుద్ధమని తెలుస్తున్నది. దళితుల్లోని అత్యంత పేదల్లో 36% కుటుంబాలకు కార్డులు లేకపోగా, గిరిజనుల్లో ఇది 14%గా ఉంది. గిరిజనుల్లో 32%, దళితుల్లో 28%, ఇతర వెనుకబడిన వర్గాల్లో 26% మంది నిత్యావసరాల కోసం ఎక్కువగా ప్రజాపంపిణీ వ్యవస్థ పైనే ఆధారపడ్డారు. వినియోగమవుతున్న బియ్యంలో 25% (గ్రామాల్లో 32%) చౌకదుకాణాల ద్వారా సమకూరుతున్నదే.

వడ్డీ వ్యాపారుల చేతుల్లో బందీలు
నెలరోజుల తలసరి బియ్యం వినియోగం రాష్ట్రసగటు 10.48 కిలోలు. అత్యంత అల్పాదాయవర్గాల్లో ఇది 9.42 కిలోలు. వీరు వినియోగిస్తున్న బియ్యంలో 40% ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్నవే. గమ్మత్తేమిటంటే తెలంగాణ వాసుల్లో అత్యధికులు కుటుంబ అవసరాలకే అప్పులు చేస్తున్న దుస్థితి నెలకొంది. రుణగ్రహీతల్లో 50.6% మంది వడ్డీ వ్యాపారుల నుంచే అప్పులు తీసుకుంటున్నారు. అందులో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా అప్పులపాలవుతున్నారు. సహకార సంఘాల నుంచి 9.3%, బ్యాంకుల నుంచి 16% మాత్రమే రుణాలు అందుతున్నాయి. సామాజికంగా వెనకబడినవారి ఆస్తుల విలువ, ఇతర సామాజిక వర్గాలవారి ఆస్తుల విలువ మధ్య అంతరం ఎక్కువగా ఉందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.

జాతీయ స్థాయి కంటే తెలంగాణలో వైద్యం ఖర్చెక్కువ
గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక్కో కుటుంబం వైద్యానికి ఏడాదికి రూ.21,683 చొప్పున ఖర్చు చేస్తోంది. జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేవు. గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించటంతో నిరుపేదలు సైతం వైద్యానికి భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యానికి జాతీయ సగటు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సగటున రూ.16,596 ఖర్చు చేస్తుంటే.. తెలంగాణలో అంతకు మించి ఖర్చవుతోంది.

పట్టణాల్లో తగ్గుతున్న లింగ నిష్పత్తి
రాష్ట్రంలో 18 శాతం కుటుంబాలు ఇప్పటికీ తాగునీటికి మినరల్ వాటర్ క్యాన్‌లపైనే ఆధారపడుతున్నాయి. రాష్ట్రంలో 36.7 శాతం ఇళ్లల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తగ్గుతోంది. పల్లెల్లో వితంతువుల సంఖ్య పెరుగుతోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా 3.7 శాతం ఉండగా తెలంగాణలో 2.6 శాతం నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు నమోదయ్యాయి. 60 ఏళ్ల పైబడిన వారిలో 87 శాతం మంది పురుషులు వివాహితులు కాగా.. వితంతువులైన మహిళలు 57 శాతం. పురుషుల్లో జీవిత భాగస్వామి లేనివారు 11 శాతం ఉన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు గట్టెక్కిస్తాయా
2012 దాకా ఉన్న రాష్ట్రంలో గృహవసతి, పేదల జీవన స్థితిగతులు దుర్లభంగా ఉన్నాయని సామాజికాభివృద్ధి నివేదిక పేర్కొన్నది. రోజు రోజుకూ పేదలు పక్కా ఇండ్లలో నివసించే పరిస్థితి లేకుండా పోతున్నదని నివేదిక ఆందోళన చెందుతున్నది. సొంతరాష్ట్రం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 20.8 శాతం ప్రజానీకం సెమీ పక్కా ఇండ్లలోనే జీవిస్తున్నారు. ఎస్సీల విషయానికి వస్తే 79.6 శాతం అత్యంత దుర్భరంగా జీవిస్తున్న స్థితి. తెలంగాణ జిల్లాల్లో, మెదక్‌లో 54 శాతం ప్రజానీకం మాత్రమే పక్కా ఇండ్లలో నివసిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ఏ మేరకు పేదలను సొంతింటికి యజమానులుగా చేస్తుందన్నదీ ప్రశ్నార్థకంగానే మారింది.

తెలంగాణలో పక్కా ఇండ్లు బాగానే ఉన్నాయట
వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని వారు అరకొర వసతుల్లోనే జీవిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం 90 శాతం మంది పక్కా ఇండ్లలోనే నివసిస్తున్నట్టు నివేదిక చెప్పింది. 2012 గణాంకాల ప్రకారం మొత్తం గ్రామీణ భారతంలో సగటున పక్కా ఇండ్లలో నివసించే వాళ్ల శాతం 65.9 కాగా పల్లె ప్రాంతాల్లో ఇది 76.2 శాతంగా ఉంది. దేశంలోని వివిధ పట్టణాల్లో 93.6 శాతం పక్కా ఇండ్లలో నివసిస్తుండగా పట్టణాల్లో అధికంగా 95.6 శాతం నివాసం ఉన్నట్లు నివేదిక సూచించింది. సగటున మనదేశంలో పక్కా ఇండ్లలో నివసించే వారి శాతం 74.7 శాతం కాగా రాష్ట్రంలో అది 83.4 శాతం అని తెలిపింది.

సీఎం కేసీఆర్ ప్రతీన నెరవేరుతుందా?
రాష్ట్రంలోని నివేదిక వివిధ జిల్లాల్లో తాగునీటికోసం విలవిల్లాడుతున్న గ్రామాల గురించి వివరంగానే నివేదించింది. ఇంటినుంచి కిలోమీటర్ల దూరం వెళ్లి, బిందెడు నీళ్లు తోడుకొని వచ్చే పరిస్థితులు ఇంకా ఉన్నాయని వివరించింది. పైప్‌లైన్లతో తాగునీరు అందించే సదుపాయం విషయంలో తెలంగాణ మొత్తం భారతదేశంతో పోలిస్తే బాగుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. పరిశుభ్రమైన పరిసరాల్లో ఇల్లు ఉండటం, మంచినీటితో సహా పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తే అవి సహజంగానే కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుతాయని నివేదిక అభిప్రాయ పడింది. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందుబాటులోకి తేవడానికి అమలుచేస్తున్న ‘మిషన్ భగీరథ' ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరో ఏడాది పాటు వేచి చూస్తే గానీ తేలదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందునా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయకపోతే ఓట్లే అడుగబోనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతీన బూనారు మరీ.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications