నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఢిల్లీ వ్యక్తులు: సీపీ ఏమన్నారంటే.?, భారీగా నగదు సీజ్?
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో నేతలు పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీకి చెందినట్లుగా చెబుతున్న వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుపడటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఢిల్లీ వ్యక్తులు?
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు ఢిల్లీకి చెందిన వ్యక్తులు వచ్చినట్లు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫాంహౌస్‌లో బేరసారాలు
గత రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తు నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనేనన్న స్టీఫెన్ రవీంద్ర
ఈ వ్యవహారంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం తమకు వచ్చిందని, ప్రలోభాల ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.

ఫాంహౌస్‌లో ఉన్న ఆ ముగ్గురు ఎవరంటే..?
పదవులు,డబ్బు, కాంట్రాక్టులతో ప్రలోభపెడుతున్నారన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామిజీ.. హైదరాబాద్ కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారని సీపీ తెలిపారు. ఈ వ్యవహారంపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం చెబుతామన్నారు.












Click it and Unblock the Notifications