నీటిపై ఏపీ - టీ గొడవ: నిన్న జగన్ అలా, పట్టిసీమపై తెలంగాణ ఇలా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి నష్టమని, ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని, వాటాలు తేలకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని, గోదావరి మిగులు జలాల పైన ఇరు రాష్ట్రాలకూ హక్కుందని తెలంగాణ... కేంద్రం, గోదావరి బోర్డుకు లేఖ రాసింది.
గోదావరిలో మిగులు జలాలను వినియోగించుకొనే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదని తెలంగాణ ఆ లేఖలో పేర్కొంది. మిగులు జలాలు ఎంతున్నాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వాటా ఎంతో తేల్చకుండానే గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టడం అక్రమమని పేర్కొంది.
తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని, విభజన చట్టానికి కూడా ఇది వ్యతిరేకమని పేర్కొంది. కృష్ణా బేసిన్‌లోని ఎగువ రాష్ట్రాల హక్కులకు కూడా నష్టమని చెప్పింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్‌తో సంబంధం లేకుండా పనులు ప్రారంభించిందని, దీనిని ఆపాలని కోరింది.

ఇదిలా ఉండగా, పట్టిసీమ ప్రాజెక్టు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున చేతులు మారాయని వైసీపీ ఆరోపించింది. జగన్ ప్రజలకు నీరు అందించే పట్టిసీమను వద్దని చెబుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా, 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. పోలవరం కుడి కాలువ ద్వారా పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు చేపట్టిన పథకం ఇది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది.












Click it and Unblock the Notifications