హైదరాబాద్ తరహాలో వరంగల్‌లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, విశేషాలివే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన ద్వితీయ శ్రేణి నగరంగా పేరొందిన వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్‌లో హెచ్ఐసీసీ తరహాలో వరంగల్ నగరంలోనూ ఓ అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రం (వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) నిర్మించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది.

రూ. 175 కోట్లతో వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
రూ. 175 కోట్లతో డబ్ల్యూఐసీసీ పేరిట దీనిని మడికొండ ఐటీ పార్కులో పది ఎకరాల్లో నిర్మించనుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దీనిని చేపట్టేందుకు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)తాజాగా టెండర్లు కూడా పిలిచింది. సమావేశ మందిరాన్ని 50 వేల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. దీనికి అనుబంధంగా మరో 30వేల చదరపు అడుగుల్లో ప్రజెంటేషన్ హాల్, సమావేశ మందిరాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటవుతాయి. అంతేగాక, 3 స్టార్ హోటల్, వినోద కేంద్రం, బాల్ రూమ్, సర్వీస్ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. వీటన్నింటి కోసం టీఎస్ఐఐసీ తాజాగా, టెండర్లు కూడా పిలిచింది.

ఐటీహబ్ గా వరంగల్
వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం మడికొండ శివార్లలో 27 ఎకరాల్లో ఐటీ పార్కును 2016లో అభివృద్ధి చేసింది. ఇక్కడ సైయెంట్, టెక్ మహీంద్ర సంస్థలు కొత్త కార్యాలయాలను నెలకొల్పాయి. మరికొన్ని నూతన కార్యాలయాలు ప్రారంభించేందుకు సిద్దమయ్యాయి. దిగ్గజ కంపెనీ జెన్‌పాక్ట్ వరంగల్‌లో తన సేవలు ప్రారంభించింది. మరోవైపు, వరంగల్ జిల్లాలో దేశంలో అతిపెద్ద కాకతీయ మెగా జౌలి పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రారంభించగా, పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

డబ్ల్యూఐసీసీతో వరంగల్ దూసుకెళ్తుందన్న ఎర్రబెల్లి
వరంగల్‌కు ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ కేంద్రాలు రావడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో వరంగల్ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications