రేవంత్ రెడ్డికి బెయిల్: హైకోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత, నృత్యాలు చేశారు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది కృష్ణ స్వరూప్‌ను తెలంగాణ న్యాయవాదులు మంగళవారంనాడు అడ్డుకున్నారు. రేవంత్ కేసు విచారణ గురించి కృష్ణ స్వరూప్ మీడియాకు వివరిస్తుండగా తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సర్ధి చెప్పారు.
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడంతో ఆయన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేట పాత బస్టాండు ఎదుట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల టిడిపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాదులోని చర్లపల్లి జైలు వద్ద సందడి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌తోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి రేవంత్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు తరలివచ్చారు. రేవంత్ అభిమానులు సంతోషంతో బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు.
రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. హైకోర్టు వద్ద సందడి నెలకొంది. న్యాయస్థానం తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్ నేతలకు చెంపపెట్టు అని వారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే రేవంత్‌ను ఓటుకు నోటు కేసులో ఇరికించారని టిడిపి కార్యకర్తలు విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు.












Click it and Unblock the Notifications