రణరంగంగా మారిన అగ్రికల్చర్ యూనివర్సిటీ.. ఏబీవీపీ ముట్టడితో ఉద్రిక్తత!!
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీలోని 100 ఎకరాల భూమిని హైకోర్టు నూతన భవనాల కోసం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు కూడా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులతో పాటు, ఏబీవీపీ ఆందోళన కొనసాగింది. గత కొద్దిరోజులుగా హైకోర్టుకు యూనివర్సిటీ భూములను ఇవ్వద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
యూనివర్సిటీ భూములలో ఉపయోగపడే అనేక మొక్కలు ఉన్నాయని, కావున ఈ భూములను హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం తీసుకోవద్దు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కోసం రంగంలోకి దిగిన ఏబీవీపీ కార్యకర్తలు వెంటనే ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో కొనసాగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

జీవో నెంబర్ 55 ను రద్దు చేయాలని ఏబీవీపీ సైతం డిమాండ్ చేస్తుంది.నేడు ఏబీవీపీ నాయకులు అగ్రికల్చర్ యూనివర్సిటీ లోని 100 ఎకరాలు ల్యాండ్ ను పరిశీలించేందుకు వెళ్లిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని దీంతో ఏబీవీపీ యూనివర్సిటీ అడ్మిన్ బ్లాక్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు . ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ ని జుట్టు పట్టి ఈడ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీని బైక్ పై వెళుతూ ఒక మహిళా పోలీస్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో ఏబీవీపీ కార్యదర్శికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యంత అమానవీయంగా మహిళా పోలీస్ ప్రవర్తించిన ఈ ఘటనపై విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 55 ను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు ఆగవని వారు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications