వృద్ధులకు టికెట్ పై రాయితీ, ఈ బస్సులకే పరిమితం- టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం..!?
టీజీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న టీజీఎస్ ఆర్టీసీ మరిన్ని ఆకర్షణీయ నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమైంది. అందులో భాగంగా బస్సు ప్రయాణికుల్లో వృద్ధులకు టికెట్ పై రాయితీ కల్పించేందుకు ఆర్టీసీ తుది కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీలో ఆర్టీసీ వృద్ధులకు టికెట్ పై రాయితీ అమలు చేస్తోంది. దీంతో, టీజీఎస్ ఆర్టీసీ సైతం ఈ నిర్ణయం అమలుకు రంగం సిద్దం చేస్తోంది.
టీజీఎస్ ఆర్టీసీ వృద్ధులకు టికెట్ రాయితీ పైన తుది కసరత్తు కొనసాగిస్తోంది. ఆర్టీసీ తన ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి మౌఖికంగా తీసుకెళ్లినట్లు సమాచారం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను త్వరలోనే కలిసి లిఖితపూర్వకంగా వివరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. టికెట్ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు తిరిగి చెల్లించేలా ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సమాచారం. రాయితీ కల్పిస్తే ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే బాలికలు, మహిళల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో నిత్యం 34 లక్షలకు పైచిలుకు బాలికలు, మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఈ పథకం ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు అమలు చేయనున్నారు.

కాగా, ఈ రాయితీ కేవలం తెలంగాణ వాసులకే వర్తిస్తుంది. అయితే వృద్ధులకు కల్పించే రాయితీని అన్ని రకాల బస్సులకు వర్తింపజేసే ప్రతిపాదన ఆర్టీసీలో ఉన్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి ప్రయాణాల టికెట్ల డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావడానికి కాస్త సమయం పడుతోంది. ఈ కారణంగా ఉద్యోగులకు జీతాలు, డీజిల్, ఇతర ఖర్చులకు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సంస్థ కొంత ఇబ్బంది పడుతోంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తూనే, ప్రయాణికుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ అధికారులు నూతన మార్గాలపైన ఆర్టీసీ ఫోకస్ చేసింది.












Click it and Unblock the Notifications