• search

రియల్ హీరోలు: 30 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల దగ్గరికి 62 ఏళ్ల బామ్మ

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఒక కుటుంబం నుంచి కొన్నేళ్ల క్రితం విడిపోయిన వ్యక్తి ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగి చివరికి కలుసుకున్న ఘటన కేవలం సినిమాల్లోనే చూస్తాం. అవి నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఘటన నిజంగా జరిగిందంటే నమ్ముతారా...?

  ఎక్కడో అస్సోంకు చెందిన 62 ఏళ్ల రషీదా బేగం తనకు తెలియకుండానే హైదరాబాద్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లోని డబీర్‌పురా బ్రిడ్జి కింద ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు కచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఓ మనసున్న మారాజు పేదలకు, యాచకులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజనం పెడతాడు.

  ఆకలికి మతం లేదు

  ఆకలికి మతం లేదు

  సిటీలో ఎక్కడున్నా సరే రషీదా బేగం మాత్రం మధ్యాహ్నం 12 గంటలు అవగానే డబీర్‌పురా బ్రిడ్జి కింద అజార్ అనే వ్యక్తి వడ్డించే భోజనం కోసం తప్పక వస్తుంది. ఇలా కొన్నేళ్లుగా అజార్ రషీదాను చూస్తున్నాడు. ఆమెతో ఏమైనా మాట్లాడదామని ప్రయత్నించినా... ఆమె బెదిరిపోయేదని అజార్ చెప్పాడు. గత ఐదు నెలలుగా మధ్యాహ్న భోజనం ఒక్కసారి కూడా ఆమె మిస్ కాలేదని అజార్ చెప్పాడు.


  డబీర్‌పురా బ్రిడ్జి కింద ప్రతిరోజు మధ్యాహ్న భోజనంకు వచ్చేవారు రషీదాను చూసేవారు. ఆమె ఎవరని అజార్‌ను ప్రశ్నించేవారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం రషీదా నోరు విప్పింది. ఆమె ఊరు అస్సోంలో ఉందని చెప్పింది. తన సోదరి హస్నా బేగం అస్సోంలో ఉంటుందని తనను కలవాలని ఉందని నోరు తెరిచి అజార్‌ను అడిగింది. సాధారణంగా అజార్ సామాజిక సేవ చేసే వ్యక్తి. "ఆకలికి మతం లేదు" అనే బోర్డు పెట్టి సర్వమతాలవారికి ప్రతిరోజు ఉచితంగా భోజనం పెడుతున్నాడు. రషీదా నోరు తెరిచి అడగ్గానే కాదనలేకపోయాడు. ఆమెను ఎలాగైనా సరే అస్సోంలోని తన సోదరి దగ్గరకు చేర్చాలని భావించి ప్రయత్నాలు ప్రారంభించాడు.

  ఆ నమ్మకమే రషీదాను తమవారి చెంతకు చేర్చింది

  ఆ నమ్మకమే రషీదాను తమవారి చెంతకు చేర్చింది

  అస్సోం అని మాత్రమే చెప్పిన రషీదా బేగం ఆ రాష్ట్రంలో ఏ ఊరు , ఏ జిల్లా అనేది మాత్రం చెప్పలేకపోయింది. ఎందుకంటే వయసు మీదపడటం 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు రావడంతో ఆమెకు ఏమీ గుర్తు లేవు. అయితే అజార్ మాత్రం ఏదో ఒక రోజు ఆమె ఊరు గుర్తుకు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. తన సోదరి హస్నా బేగం అస్సోంలోని గోలాఘాట్‌లో ఉంటుందని చెప్పింది. మళ్లీ అజార్‌కు ఎక్కడో అనుమానం. పెద్దావిడ చెప్పే ఊరు కరెక్టే అని నమ్మడం ఎలా..? అయిన పట్టు వదలని విక్రమార్కుడిలా అందులో కూడా నిజం ఉండొచ్చేమోనని ప్రయత్నం ప్రారంభించాడు.

  వెంటనే అస్సోంలో ఉన్న తన స్నేహితుడు హబీబ్ ఇక్రంకు సమాచారాన్ని చేరవేశాడు. రషీదా కుటుంబాన్ని గుర్తించాలని రిక్వెస్ట్ చేశాడు. రషీదా ఫోటోను ఇక్రంకు పంపించి ఎలాగైనా ఆమె కుటుంబం ఆచూకీ తెలుసుకోవాలన్నాడు. గౌహతి నుంచి గోలాఘాట్‌కు ఇక్రం బయలుదేరాడు. గోలా ఘాట్‌లో రషీదా అనే వృద్ధురాలు నిజంగా నివసించిందో లేదో తెలియకుండానే తన ప్రయాణం మొదలు పెట్టినట్లు ఇక్రం తెలిపాడు .ముందుగా గోలాఘాట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడి పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పిన ఇక్రమ్... పోలీసుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని వివరించాడు. రషీదా ఫోటో చేతిలో పట్టుకుని గోలాఘాట్‌లో కనిపించిన ప్రతిఒక్కరిని అడిగినట్లు చెప్పాడు. అయితే ఆమె ఎవరో తెలియదని గోలాఘాట్ గ్రామస్తులు తెలిపారు. ఇలా రెండు నెలలు గోలాఘాట్‌లో తిరిగాక, రషీదాతో పాత జ్ఞాపకాలు ఉన్న ఓ వ్యక్తి ఇక్రంకు ఎదురయ్యాడు. రషీదాను గుర్తించాడు. ఆ వ్యక్తి రషీద గురించి మాట్లాడటంతో ఇక్రంలో తిరిగి ఆశలు చిగురించాయి. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని అజార్‌కు తెలిపాడు ఇక్రం.

  గోలా ఘాట్‌ టూ ఢేకియాజూలీ

  గోలా ఘాట్‌ టూ ఢేకియాజూలీ

  అస్సోంలోని చాలా గ్రామాల పేర్లను రషీదా ముందు వల్లెవేశాడు అజార్. ముందు ఆమె గుర్తించనప్పటికీ ఒక్క గ్రామం పేరు చెప్పగానే ఆమెలో కదలిక మొదలైంది. ఆ గ్రామం పేరే ఢేకియాజూలీ. ఈ గ్రామం పేరు రషీదా చెప్పిందని ఇక్రంకు అజార్ తెలుపగానే వెంనే ఢేకియాజూలీ గ్రామానికి బయలుదేరాడు. ఇది గోలా ఘాట్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామానికి చేరుకున్న ఇక్రం ఎప్పటిలాగే ముందుగా పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే వారు గోలాఘాట్ పోలీసులులా కాకుండా ఆయనకు కొంత సహాయం చేశారు. అయితే ఢేకియాజూలీ గ్రామస్తులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించారు. బయట వ్యక్తులపై వారు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. ఢేకియాజూలీ గ్రామంలో అడుగుపెట్టిన ఇక్రం... రషీదా ఫోటో చూపించగానే అక్కడి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో పెద్దగా కష్టపడకుండాడనే హస్నా బేగం ఇళ్లును కనుగొన్నాడు. రషీదా మంత్రసాని అని కొందరు చెప్పినట్లు ఇక్రం తెలిపాడు. ఆమె గతం చాలా భాధాకరమైనదని మరికొందరు చెప్పారు.

  రషీదా ఇంకా బతికే ఉందని తెలిసి తన సోదరి హస్నా ఎంతో సంబరపడింది. తను 30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయిందని ఆమె ఇక తిరిగి రాదని భావించినట్లు హస్నా పేర్కొంది. అయితే రషీదా గోలాఘాగ్ గ్రామం గురించి ఎందుకు చెప్పి ఉంటుందని హస్నాను అడిగాడు ఇక్రం. ఆమె దగ్గర నుంచి వచ్చిన సమాధానంతో షాక్ అయ్యాడు.

  రషీదా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్

  రషీదా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్

  రషీదా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందని ఆ తర్వాత గోలాఘాట్‌కు చెందిన వ్యక్తిని 1986లో వివాహం చేసుకుందని వివరించింది. అయితే తన భర్త రషీదాను ఇంటినుంచి తరిమివేశారని చెప్పింది. అది జరిగిన కొద్ది రోజులకే మరో విషాదం రషీదా జీవితంలో చోటుచేసుకుందని చెప్పిన హస్నా... ఆమెకు ఉన్న ఒకే ఒక కుమారుడు మృతి చెందాడని చెప్పింది. దీంతో మానసికంగా చాలా కృంగిపోయిందని కన్నీటిపర్యంతమైంది హస్నా.

  విషయం తెలుసకున్న అజార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రషీదా సోదరిని హైదరాబాద్‌కు తెప్పించే ఏర్పాట్లు చేశాడు. జూలై 20న ఆమె హైదరాబాద్‌కు చేరుకుంది. హస్నాను చూడగానే రషీదా గుర్తు పట్టింది. ఒకరినొకరు కౌగలించుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దృశ్యం చూసిన అజార్‌కు కూడా కళ్లలో నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు రషీదా హస్నా కలిసి అస్సోంకు వెళ్లారు. హసీనా చేయిని 62 ఏళ్ల రషీదా గట్టిగా పట్టుకున్న దృశ్యం చూస్తే చిన్నపిల్లలు తల్లి చిటికిన వేలును పట్టుకున్నట్లే అనిపించింది.

  మొత్తనికి 30 ఏళ్ల తర్వాత ఒక వృద్ధురాలును తిరిగి తన కుటుంబం చెంతకు చేర్చడంలో విజయం సాధించిన అజార్, ఇక్రంలను అభినందించాల్సిందే. ఆశ నిరాశల మధ్య సాగిన ఈ ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేమని చెబుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  This real story will definitely land you in tears. The 62 year old lady Rasheedha finally met her sister after 30 years. Thanks to the Hyderabad based NGO boys Azhar and Ekram who made it possible for this poor lady Rasheedha.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more