ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, హవాలా అని ఎలా అంటారు?: రఘునందన్ రావు
దుబ్బాక: హైదరాబాద్ నగరంలో పట్టుబడిన డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదని దుబ్బాక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక సంస్థ యజమాని మరో సంస్థకు ఇచ్చిన నగదు హవాలా సొమ్ము ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
ఆ డబ్బు సిద్దిపేట, దుబ్బాకకు వచ్చిందా? అని రఘునందన్ రావు నిలదీశారు. . సురభి శ్రీనివాసరావు తన బావమరిదేనని తెలిపారు. ఆయనకు చెందిన ఎ టు జడ్ సంస్థకు బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్‌కు వ్యాపార లావాదేవీలున్నాయన్నారు. ఓ కంపెనీ యజమాని మరో కంపెనీ యజమానికి ఇచ్చిన డబ్బు.. హవాలా ఎలా అవుతుందని నిలదీశారు.

హైదరాబాద్‌లో ఏ కంపెనీ వ్యాపారం చేసుకోవట్లేదా? చట్ట ప్రకారం పన్నులు కట్టకుండా దొరికిన నగదు అయితే సంబంధిత శాఖలకు అప్పగించాలన్నారు. అంతేగానీ, తనపై బురదజల్లేడమేంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు, మంత్రి హరీశ్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతోనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను తన చివరి వరకు దుబ్బాక ప్రజల కోసం పోరాడతానని తెలిపారు.
కాగా, ఆదివారం హైదరాబాద్ నుంచి తరలిస్తోన్న రూ.1కోటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు అరెస్టయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశామని, ఈ క్రమంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1 కోటి నగదు పట్టుకున్నారని సీపీ అంజనీకుమార్ చెప్పారు. బేగంపేట ఫ్లై ఓవర్ సమీపంలో డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ డబ్బుకు దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధం ఉందని తేలిందని, హవాలా డబ్బుతో పట్టుపడిన వ్యక్తుల్లో సురభి శ్రీనివాస్ ఒకరి, ఆయన.. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు స్వయాన బావమరిది అని సీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications