ఇప్పుడు టోల్ గేట్ల వద్ద దసరా పండుగంతా కనిపిస్తుంది!
దసరా పండగ ముగిసింది. దసరా పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులంతా తిరిగి మళ్లీ నగరం బాట పట్టారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. నేటి నుంచి కార్యాలయాలు తెరుచుకోవడంతో చాలా మంది నిన్న సాయంత్రం నగరానికి చేరుకునేందుకు బయలుదేరారు.
టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు.. పండుగ రద్దీ
ఇక టోల్ ప్లాజాల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని పలు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిర్వహిస్తున్నప్పటికీ ఒకేసారి అందరూ ప్రయాణాలు చేయడంతో, ప్రయాణికులు ఇబ్బంది పడవలసి వచ్చింది.

జాతీయ రహదారులు బిజీబిజీ
65వ నెంబర్ జాతీయ రహదారిపైన ఈరోజు ఉదయం నుంచి ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్, నల్గొండ జిల్లా కేతేపల్లి టోల్ గేట్ వద్ద ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇక పంతంగి టోల్ గేట్ వద్ద కూడా ట్రాఫిక్ కు తీవ్రంగా ఇబ్బంది కలిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద 16గేట్లకు గాని 10గేట్ల ద్వారా వాహనాలను హైదరాబాద్ వైపు పంపిస్తున్నారు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్
బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా కిలోమీటర్ కు పైగా వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ శివారులోని టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. సాధారణ రోజుల్లో 30వేల నుంచి 40వేల వాహనాలు ప్రయాణించే ఈ మార్గాలలో దసరా పండుగ సందర్భంగా 50వేలకు పైగా వాహనాలు ఒకేసారి రద్దీగా మారడంతో ఇబ్బంది తలెత్తుతుందని టోల్ గేట్ ల నిర్వాహకులు చెబుతున్నారు.
ఎక్కడికక్కడ వాహనాల రద్దీ
ఇదిలా ఉంటే నార్కెట్ పల్లి, అద్దంకి రాష్ట్ర రహదారిపైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నిన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద కూడా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. నిన్న సాయంత్రం సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ టోల్ ప్లాజా వద్ద నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇలా పండుగకు వెళ్ళిన వారు తిరిగి తమ తమ ప్రాంతాలకు వస్తున్న క్రమంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ నెలకొంది.












Click it and Unblock the Notifications