అదే చిచ్చు: బలైన జయశ్రీ, మాధవి.. వేర్వేరు ఘటనలు.. ఒకే కోణం..
నల్గొండ జిల్లా కోదాడలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు అనుమానాస్పద మృతి కేసుల్లో ఒకే కోణం వెలుగుచూడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కోదాడ: ఇద్దరి వయసు ఇంచుమించు ఒకటే. ఇద్దరూ ఇంజనీరింగ్ చదువుకుని నచ్చినవాళ్లను ప్రేమ వివాహం చేసుకున్నవారే. సాఫీగా సాగిపోతుందనుకున్న ఆ ఇద్దరి వివాహితల జీవితాల్లో సెల్ ఫోన్ చిచ్చు పెట్టింది. పాత స్నేహాన్ని అనుమానించిన భర్త ఒకరైతే.. వివాహితను బ్లాక్ మెయిల్ చేసిన స్నేహితుడు మరొకరు.
నల్గొండ జిల్లా కోదాడలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు అనుమానాస్పద మృతి కేసుల్లో ఒకే కోణం వెలుగుచూడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. జయశ్రీ(24), మాధవి(23)ల మరణం వెనుక అసలు కారణాలేంటో పోలీసుల దర్యాప్తులోనే బయటపడనున్నాయి.

ఎవరీ జయశ్రీ:
కోదాడలో ఇంజనీరింగ్ చదువుకున్న జయశ్రీ.. పట్టణానికే చెందిన శ్రావణ్ అనే అబ్బాయిని ప్రేమించింది. చదువు పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి అదే అబ్బాయిని వివాహం కూడా చేసుకుంది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో సెల్ ఫోన్ రూపంలో కొన్నాళ్లకే పెద్ద కుదుపు మొదలైంది. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన ఓ మిత్రుడితో జయశ్రీ అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేది. భర్త శ్రావణ్ కు ఈ వ్యవహారం నచ్చలేదు.

భర్త వేధింపులు:
క్లాస్‌మేట్‌తో ఫోన్ మాట్లాడుతుండటంపై భర్త శ్రావణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో జయశ్రీ-శ్రావణ్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలి కాలంలో ఇద్దరూ తరుచూ గొడవపడుతూనే ఉన్నారు. జయశ్రీతో ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తిని శ్రావణ్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఫోన్ సంభాషణల రికార్డు తన వద్ద ఉందని జయశ్రీని కూడా బెదిరించాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి తనను వేధిస్తున్నాడని జయశ్రీ బాధపడింది.

హత్యా? ఆత్మహత్యా?:
జయశ్రీ-శ్రావణ్ ల మధ్య గొడవల నేపథ్యంలో జయశ్రీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రావణ్, అతని తల్లిదండ్రులు కలిసి తమ కుమార్తెను వేధించారని ఆరోపిస్తున్నారు. వరకట్నం కోసం వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జయశ్రీ లాగే మాధవి కేసు:
కోదాడకు చెందిన మాధవి ఇంజనీరింగ్ చదువుకుంది. నెలన్నర క్రితమే ఖమ్మం జిల్లా వత్సవాయికి చెందిన సతీష్ అనే అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే అని తల్లిదండ్రులు వారించినా వినలేదు. సతీష్ కష్టపడి పైకొచ్చి ఏఈగా ఉద్యోగం చేస్తుండటంతో అతనితో తన జీవితం బాగుంటుందని వారికి నచ్చజెప్పింది. నెలన్నర క్రితం వివాహం కూడా జరిగింది.

సెల్ ఫోన్ చిచ్చు:
చదువుకునే రోజుల్లో ఉన్న పరిచయంతో మిత్రుడు వంశీకృష్ణతో గతంలో మాధవి తరుచూ ఫోన్ లో మాట్లాడింది. అయితే ఆ ఫోన్ కాల్స్ ను అడ్డుపెట్టుకుని వంశీకృష్ణ మాధవిని వేధించడం మొదలుపెట్టాడు. ఇదే విషయంపై గతంలో కోదాడ పోలీస్ స్టేషనులోను మాధవి ఫిర్యాదు చేసినట్టుగా సతీష్ చెబుతున్నాడు. వంశీకృష్ణతో తాడో పేడో తేల్చుకోవడానికే ఇటీవల ఆమె కోదాడకు వచ్చినట్టు తెలుస్తోంది.

హత్యే అంటున్న బంధువులు:
సోమవారం కోదాడకు వచ్చిన మాధవి తన మరిదిని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఉండమని చెప్పి తాను ఆటోలో షిర్డీ నగర్ వెళ్లింది. అక్కడ వంశీకృష్ణతో ఫొన్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఇంతలో వంశీకృష్ణ భార్య కూడా వచ్చి మాధవితో గొడవ పడిందని.. అది కాస్త ఘర్షణకు దారితీసి మాధవిని హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.
మాధవి చనిపోయిన గదిలో ఫ్యాన్‌కూడా లేదని, చున్ని ఆమె బరువును కూడా ఆపదని అందువల్ల ఆత్మహత్య కానే కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు.మాధవి మృతిపై కూడా ఆమె భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్-302కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. మాధవి, జయశ్రీల కేసుల వెనుక మిస్టరీని చేధిస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications