Naveen Reddy: నవీన్ రెడ్డి కారును గుర్తించిన పోలీసులు.. అందులో మద్యం బాటిళ్లతోపాటు కీలక ఆధారాలు..!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు. అయితే ఈ కేసులో కీలకంగా మారిన నవీన్ రెడ్డి కారు లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద ఓవెంచర్‌లో నవీన్ రెడ్డి కారును గుర్తించారు. స్థానికులకు ఈ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు సమాచారం ఇచ్చారు.

నవీన్ రెడ్డి కారుగా
అక్కడి చేరుకున్న పోలీసులు అది నవీన్ రెడ్డి కారుగా నిర్ధారించారు. కారులో మద్యం బాటిళ్లు, యువతికి సంబంధించిన దుస్తులు లభ్యమైనట్లు పేర్కొన్నారు. కిడ్నాప్ అనంతరం నవీన్ రెడ్డి తన కారును అక్కడ వదిలేసి.. పక్కనే ఉన్న ఓయో హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హోటల్‌లో బస చేస్తే గదిని బుక్ చేసింది ఎవరు? ఏ వ్యక్తి గుర్తింపు కార్డు ద్వారా అక్కడ బస చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు.

నవీన్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ఆరా
నవీన్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వరంగల్ ఇంతేజారు గంజ్ పీఎస్ పరిధిలో 2019లో నవీన్ రెడ్డిపై చీటింగ్, ఐటీ సెక్షన్స్ కింద కేసు నమోదనట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా 2019లో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో రోడ్డు ప్రమాదం చేసినట్టు నవీన్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

నాలుగు బృందాలు గాలింపు
నవీన్‌రెడ్డిని గాలించడానికి నాలుగు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నామని రాచకొండ సీపీ తెలిపారు. ఈ కేసులో 32 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. నవీన్‌రెడ్డిని, అతడి ప్రధాన అనుచరుడైన రూబిన్‌తో పాటు చందు, సిద్దు అనే మరో ఇద్దరిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications