Vegetable Prices: ఏం కొనేతట్టులేదు.. ఏం తినేతట్టులేదు..
కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.300 పెట్టినా వారానికి సరిపడ కూరగాయలు రావడం లేదు. ముఖ్యంగా టమాటా, పచ్చి మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కూరగాయల రేట్లు పెరగడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కేజీ కొనేవారు.. అరకేజీ కొంటున్నారు. అరకేజీ కొనేవారు పావుకేజీ కొంటున్నారు.
పచ్చి మిర్చి హోల్ సెల్ గా కిలోకు రూ.100 నుంచి 120 పలుకుతుండగా.. రిటైల్ లో కిలోకు రూ.160 వరకు తీసుకుంటున్నారు. విరివిగా వాడే టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు లబోతిబోమంటున్నారు. మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా కిలోకు రూ.80 అయింది. ఆకుకూరల ధరలు కూడా పెరిగాయి.

పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చల కూర, మెంతికూర, కొత్తిమీర, బచ్చల్ కూర, గంగవెల్లికూరల ధరలు భారీగా పెరిగాయి. కొత్తిమీర, పుదీనా ధరలు కూడా అంతే ఉన్నాయి. సిటీలో డైలీ 150 టన్నుల ఆకుకూరల డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 80 టన్నులు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెగుదల 15 రోజు నుంచి 30 రోజుల వరకు ఉంటుందని చెబుతున్నారు.
బోయిన్‌పల్లి మార్కెట్‌కు గతంలో 32 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి కాగా సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు వచ్చాయి. గుడిమల్కాపూర్ కు గతంలో 10 వేల క్వింటాళ్లు రాగా.. ప్రస్తతుం 4 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయల అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
పచ్చి మిర్చి రూ. 120, టమాటా రూ. 80, కాకరకాయ రూ. 100, వంకాయ రూ. 80, బీరకాయ రూ.80, క్యారెట్ రూ.80, దొండకాయ రూ.80, ఉల్లిగడ్డ రూ.30, బెండకాయ రూ. 80, అలచంద రూ.80, దోసకాయ రూ.60, గోరుచిక్కుడ రూ. 80 గా ఉన్నాయి. అటు కోడికూర, కోడి గుడ్డు ధరలు కూడా బాగానే ఉన్నాయి. కిలె చికెన్ రూ.300 ఉండగా.. కోడి గుడ్డు ఒక్కటి రూ.6 నుంచి రూ.7 ఉంది.












Click it and Unblock the Notifications