Telangana: 72 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..
తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని శనివారం ఓ నివేదిక వెల్లడించింది. అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 58 శాతం మంది అంటే 59 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. 119 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 118 మంది నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను విడుదల చేశాయి. ప్రస్తుత అసెంబ్లీలో సికింద్రాబాద్ నియోజకవర్గం ఒకటి ఖాళీగా ఉంది.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లు, ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల ఆధారంగా నివేదిక రూపొందించారు. ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నానికి సంబంధించిన కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడిన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్-376 కింద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదు అయింది.

ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు (86 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు (67 శాతం), బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు. అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 38 (38 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నట్లు నివేదికలో తెలిపారు.
ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు (29 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు (50 శాతం), బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుండగా కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో దూకుడుగా ప్రచారం చేస్తోంది.












Click it and Unblock the Notifications