ఏపీ సీఎం జగన్ తో పరిచయం లేదు: ప్రతిపక్షం నేతలేనంటూ చీకోటి ప్రవీణ్ కామెంట్స్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రంలో కలకలం సృష్టించిన చీకోటి ప్రవీణ్- క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా ఈడీ అధికారులు క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డిలను ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడుగుతున్నారు.

ఈడీ విచారణలో చీకోటి ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు
కాగా, కొన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలను.. ప్రవీణ్ ఈడీ అధికారులకు చెప్పలేకపోతున్నాడని తెలిసింది. నేపాల్‌లో జరిగిన క్యాసినోకు డబ్బులు ఎలా తీసుకెళ్లారని అడిగిన ప్రశ్నకు ప్రవీణ్, మాధవ రెడ్డిలు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

హవాలా జరిగినట్లు ఈడీ అనుమానాలు
హైదరాబాద్‌లో నగదు తీసుకొని కాయిన్స్ ఇచ్చి... నేపాల్‌లో ఆ కాయిన్స్ ఇస్తే.. నగదు ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. క్యాసినోలో గెల్చుకున్న డబ్బును తిరిగి ఇస్తే అక్కడ కాయిన్స్ ఇచ్చారని.. ఆ కాయిన్స్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ప్రవీణ్, మాధవ రెడ్డిలు నగదు ఇచ్చినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు ఈడీ అధికారులు. 25కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

జగన్‌తో పరిచయం లేదన్న చీకోటి ప్రవీణ్.. ప్రతిపక్షంపై..
మరోవైపు, తనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో పరిచయమే లేదని క్యాసినో కేసులో నిందితుడు చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశాడు. కొందరు తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి తప్పుడు పోస్టులు చేస్తున్నారని తెలిపాడు. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఏపీ ప్రతిపక్ష నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏపీ ప్రతిపక్షం అంటే ఎవరో ప్రపంచమంతా తెలుసని చీకోటి ప్రవీన్ చెప్పాడు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష అంటే టీడీపీనే.. పరోక్షంగా ప్రవీణ్ ఆ పార్టీ నేతలపైనే ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, రాజకీయ నాయకులకు తనకు ముడిపెడుతున్నారని మండిపడ్డారు. అయితే, క్యాసినో వ్యవహారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications