'స్మృతికి తప్పుడు సమాచారం': విద్యార్థుల భగ్గు, లేఖ రాశా నిజమే కానీ.. విహెచ్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన పైన స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ ప్రకాశ్ బాబు బుధవారం నాడు స్పందించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన చెప్పారు.
ఈసీ సబ్ కమిటీకి తాను చైర్మన్‌ను కాదని చెప్పారు. ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని చెప్పారు. వేముల రోహిత్ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చే విషయమై యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్‌తో చర్చిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల సస్పెన్షన్ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. బోర్డు నిర్ణయాలతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తాను చెప్పానని అన్నారు. విద్యార్థులకు ఫెలోషిప్ కూడా రాదని తాను కమిటీకి చెప్పానని అన్నారు.

'స్మృతి ఇరానీ కేంద్రమంత్రిలా మాట్లాడలేదు'
స్మృతి ఇరానీ కేంద్రమంత్రిలా మాట్లాడలేదని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి బుధవారం పేర్కొంది. ఆమె బిజెపి అధికార ప్రతినిధిలా మాట్లాడారన్నారు. బండారు దత్తాత్రేయ, వైస్ ఛాన్సులర్లను అరెస్టు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మంత్రిని తప్పుదారి పట్టించారన్నారు.
విద్యార్థులు నా వద్దకు వచ్చి సమస్య చెప్పారు, లేఖ రాశా: విహెచ్
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారని, దీంతో 2014లో తాను కేంద్రానికి లేఖ రాశానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి హనుమంత రావు చెప్పారు. తాను లేఖ రాస్తే కేంద్రం నుంచి సమాధానం రాలేదన్నారు. తాను లేఖ రాసినప్పుడే స్పందించి ఉంటే రోహిత్ చనిపోయేవాడు కాదన్నారు.
అయితే, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు తాను రాసిన లేఖకు, కేంద్రమంత్రి దత్తాత్రేయ రాసిన లేఖకు తేడా ఉందని రాజ్యసభ సభ్యుడు విహెచ్ చెప్పారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని వీహెచ్ కోరారు.
కాగా, వర్సిటీ సమస్య పైన కేవలం బండారు దత్తాత్రేయ మాత్రమే లేఖ రాయలేదని, విహెచ్ కూడా లేఖ రాశారని స్మృతి ఇరాని చెప్పిన విషయం తెలిసిందే. సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు ఎంపీలుగా లేఖ రాయడం సహజమేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications