ఎవరిది తప్పు?: తిరుపతి తొక్కిసలాటపై రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటనపై తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకు చాలా పవిత్రమైన రోజు అని టీ రాజా సింగ్ అన్నారు. పవిత్రమైన రోజు కావడం వల్ల లక్షలాది మంది హిందువులు తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటారని చెప్పారు. ప్రతి సంవత్సరం తిరుమలలో చాలా వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంటుందని, లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని గుర్తు చేశారు.
ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుమంది మరణించారని, 48 మంది గాయపడ్డారని, ఇందులో ఎవరి తప్పు ఉందని టీ రాజా సింగ్ ప్రశ్నించారు. తప్పు ఎవరిదనే విషయంపై చాలా లోతుగా దర్యాప్తు జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తోన్నానని అన్నారు.
పోలీసులు గేటు తెరవకపోయివుంటే తొక్కిసలాట జరిగి ఉండేది కాదనే విషయాన్ని అక్కడి పరిస్థితులు తెలియజేస్తోన్నాయని, ఇందులో ఎవరి తప్పు ఉందనేది బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిసై సమగ్ర విచారణ జరిపించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.
ఆరుమంది మృతుల కుటుంబాలకు టీటీడీ ఛైర్మన్, చంద్రబాబు వేర్వేరుగా 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాజా సింగ్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని, ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లు చేయాలని రాజా సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications