TN Vamsha TilaK: కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 13వ తేదీన జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. టిఎన్ వంశా తిలక్ బరిలో నిలవనున్నట్లు బీజేపీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే.
ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దించింది. గత శాసనసభ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నారాయణ శ్రీ గణేశ్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో శ్రీగణేశ్‌కే కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో బీజేపీ తాజాగా తన అభ్యర్థిని ప్రకటించింది.

తమ అభ్యర్థిగా డాక్టర్ వంశా తిలక్‌ను ఖరారు చేస్తూ బీజేపీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. కాగా, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఎన్ సదాలక్ష్మి కుమారుడైన వంశాతిలక్, వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆసక్తి కనబర్చినా.. సామాజిక, రాజకీయ అంశాల దృష్ట్యా వంశా తిలక్‌నే ఆ పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.
మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ప్రచార జోరును పెంచాయి. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయడంతో కంటోన్మెంట్‌లో కాషాయ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళ్లకేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం విధితమే. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్‌ను ఢీకొని, ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, సరిగ్గా ఏడాది క్రితం (2023, ఫిబ్రవరి) లాస్య నందిత తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆమె మరణంతో ఇప్పుడు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.












Click it and Unblock the Notifications