నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన.. బండి సంజయ్ పిలుపు; రీజన్ ఇదే!!
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ తమ ఆందోళనను ఉధృతం చేస్తోంది. ఇప్పటికే నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై టార్గెట్ చేస్తున్న బండి సంజయ్ కు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అస్త్ర శస్త్రాలను అందిస్తున్నాయి. కవిత లిక్కర్ స్కాం ఎపిసోడ్ తో ఆందోళనలు చెలరేగగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.

కవిత ఇంటివద్ద బీజేపీ ధర్నా .. ఉద్రిక్తత, బీజేపీ నాయకుల అరెస్ట్
తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో మరింత ఉధృతంగా టిఆర్ఎస్ పై దాడిని కొనసాగిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు రావడంతో కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కవిత ఇంటిని ముట్టడించారు. బంజారాహిల్స్ లోని ఆమె ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేవైఎం కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించడంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కర్రలతో కొట్టుకున్నారు. ఆపై ఈ వ్యవహారంలో మరింత ఉద్రిక్తత చోటు చేసుకొని తోపులాట జరగగా, పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.

పోటాపోటీ ఆందోళనలు .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బండి సంజయ్ పిలుపు
ఇక బిజెపి కార్యకర్తలు కవిత ఇంటిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు బిజెపి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, తాజాగా బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడిని, పోలీసులు పెట్టిన కేసులను నిరసిస్తూ బండి సంజయ్ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులపై దాడులకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన బండి సంజయ్ తమ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసుల తీరుపై సీరియస్ అయిన బండి సంజయ్
పోలీసుల తీరుపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే హత్యాయత్నం కేసులు పెడతారా అంటూ బండి సంజయ్ పోలీసులను నిలదీశారు. నిరసన వ్యక్తం చేస్తే హత్యాయత్నం కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు బండి సంజయ్, మీరే మా వాళ్ళ పై దాడులు చేసి హత్యాయత్నం కేసులు ఎలా పెట్టారు అంటూ ప్రశ్నించారు. గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించక పోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్, లిక్కర్ స్కామ్ పై నిజానిజాల నిగ్గు తేల్చే దాకా ఎవరిని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు.

కెసీఆర్ సర్కార్ ను, కవితను టార్గెట్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ఈ క్రమంలోనే బండి సంజయ్ ఆదేశాలతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతలపై జరిగిన దాడులపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెసిఆర్ సర్కారు తీరును ఎండగడుతూ, కల్వకుంట్ల కవిత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించనున్నారు. మొత్తానికి బీజేపీ నేతలకు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉందన్న వ్యవహారం ఒక పెద్ద ఆయుధంగా మారింది. దీంతో టిఆర్ఎస్ పార్టీ ని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి బిజెపి నాయకులు సమాయత్తమవుతున్నారు.












Click it and Unblock the Notifications