టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ పీఆర్వో,నిర్మాత బీఏ రాజు కన్నుమూత...
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం(మే 21) రాత్రి గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బీఏ రాజు తనయుడు శివ కుమార్ ఈ విషయం వెల్లడించారు.
బీఏ రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జయ 2018లో కన్నుమూశారు. బీఏ రాజు మృతి పట్ల హీరో మహేశ్ బాబు,సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్,నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సహా పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 'బీఏ రాజు గారి అకాల మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఆయన నాకు చిన్నతనం నుంచి తెలుసు. ఎన్నో ఏళ్లు కలిసి ప్రయాణం చేశాం. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. ఆయన మరణం మా కుటుంబానికి,చిత్ర పరిశ్రమకు తీరని లోటు' అని మహేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్ర పరిశ్రమలో దిగ్గజ పీఆర్వోగా గుర్తింపు తెచ్చుకున్న బీఏ రాజు మృతికి సంతాపంగా... శనివారం(మే 22) సోషల్ మీడియాలో ఎటువంటి సినీ అప్‌డేట్స్ పోస్టు చేయకూడదని టాలీవుడ్ పీఆర్వోలు నిర్ణయించారు.
బీఏ రాజు సినీ జర్నలిస్టుగా తన కేరీర్‌ను ప్రారంభించారు. అప్పట్లో 'సూపర్ హిట్' అనే సినీపత్రికను నడిపారు. మహేశ్ బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు పీఆర్‌ఓగా పని చేశారు. ఆ తర్వాతి కాలంలో నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2003లో ఆయన భార్య బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు ఆయనే నిర్మాతగా ఉన్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు.












Click it and Unblock the Notifications