కబ్జాలో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి భూమి: విలువ రూ. 200 కోట్ల పైమాటే..!
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ ఆసుపత్రికి చెందిన విలువైన భూమి అన్యాక్రాంతమైంది. సుమారు రూ. 200 కోట్ల విలువైన భూమిని రఘువంశప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేశాడని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి వెల్లడించారు.
మంగళవారం కృష్ణారెడ్డితో పాటు కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డిలు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపారు.
కబ్జాకు గురైన భూమిని సంరక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్, రెవెన్యూ శాఖలపైనే ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన రికార్డులు కమిటీ ముందు ఉంచాలని ఆదేశించినట్లు తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పేర్కొంది. వీటితో పాటు మెంటల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖైదీల వార్డు నిర్మాణం కూడా కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు.

చెరువులు కబ్జాకు పాల్పడితే చర్యలు: అసెంబ్లీ అంచనాల కమిటీ
రాయదుర్గం చెరువును మంగళవారం అసెంబ్లీ అంచనాల కమిటీ పరిశీలించింది. చెరువులోని 60 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు కమిటీ గుర్తించింది. రూ. 1500 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు.
నగరంలోని చెరువులు కబ్జాకు పాల్పడితే వారిపై కఠిన చర్యులు తీసుకుంటామని అన్నారు. కబ్జాలకు పాల్పడిన వారి వివరాలను చెరువు వద్దే ప్రదర్శిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications