కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ- తేల్చేసిన టీపీసీసీ చీఫ్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీగా రాజీనామా ఆమోదం తరువాత కవిత అడుగులు కీలకంగా మారాయి. మేధావులు.. సన్నిహితులతో కవిత వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయాల దిశగా కవిత ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ లో చేరిక పైనా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో.. కాంగ్రెస్ లోకి కవిత ఎంట్రీ పైనా టీపీసీసీ చీఫ్ స్పష్టత ఇచ్చారు. దీంతో.. ఇక రానున్న రోజుల్లో పరిణామాలు మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో తన సంస్థ జాగృతిని రాజకీయ వేదికగా మలిచే ప్రయత్నం చేస్తున్నారనేది మరో వాదన. ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తమ పార్టీలోకి కవిత ఎంట్రీ పైన స్పష్టత ఇచ్చారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాగా, కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అజారుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీల విషయంలో మంచి స్పందన వస్తోందని నమ్ముతున్నట్లు తెలిపారు.

ఇక, నీటి వివాదాల్లో తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ పని చేస్తున్నారని.. ఏ విధంగానూ ఒక్క నీటి బొట్టును వదులుకొనేది లేదని స్పష్టం చేసారు. ఏప్రిల్‌లో కార్పొరేషన్ ఛైర్మన్లను భర్తీ చేస్తామని ప్రకటించారు. పదవులు తక్కువ అయ్యాయని... ఆశావహులు ఎక్కువ అయ్యారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ తరఫున ఒక కమిటీ వేస్తామని.. సర్వేల ఆధారంగా టికెట్ల ఇస్తామని చెప్పారు. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా తనకు, సీఎం రేవంత్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు పీసీసీ చీఫ్. మంత్రులకు, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేశ్ తేల్చిచెప్పారు. ఇతర మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి తలదూర్చరన్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని వెల్లడించారు. డీ సెంట్రలైజేషన్ కోసమే మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని మహేష్ గౌడ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications