గాడిదకు జన్మదిన వేడుకలు.. రేవంత్ రెడ్డి అరెస్ట్; అప్రజాస్వామికమన్న కాంగ్రెస్ శ్రేణులు
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిరసనకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా మూడు రోజులపాటు జరపడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని టిపిసిసి పిలుపునిచ్చిన నేపథ్యంలో, అప్రమత్తమైన పోలీసులు జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్ ... కేసీఆర్ జన్మదిన వేడుకలపై మండిపడిన రేవంత్
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి పోలీసులు నిలదీశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇప్పటివరకు 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఉద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా ఏం సాధించారని కెసిఆర్ ఇంత గొప్ప జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలకు పిలుపునిచ్చారు.

గాడిదకు జన్మదినవేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
ఈరోజు 11 గంటలకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాడిదకు జన్మదిన వేడుకల పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీభవన్ వద్ద దీనికోసం ఏర్పాటు చేయగా, ఆందోళనలో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లుగా సమాచారం. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఏ పోలీస్ స్టేషన్ కు తరలించకుండా నగర రోడ్ల పైనే తిప్పుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.
Recommended Video

రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం .. మండిపడిన కాంగ్రెస్ నేతలు
రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్ లు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధకాండ అమలు చేస్తుందని మండిపడ్డ వారు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. ఇంత నిర్బంధకాండ ఎప్పుడూ లేదని, ఇదంతా ప్రజలు చూస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications