తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట.. చేవెళ్లలో రేవంత్, ఖమ్మంలో భట్టి పాదయాత్ర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. దేశంలో రోజురోజుకూ పెరిగిన నిత్యావసర ధరల పెరుగుదల, భూ సంస్కరణలే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టేలా పాదయాత్రకు సిద్దమైంది. ఇవాళ చేవళ్ల నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్రకు సీడబ్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

రాహుల్, ప్రియాంక గాంధీలకు సంఘీభావంగా..
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల , భూసంస్కరణలపై పోరుకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు దిగారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం పాదయాత్రకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు.

చేవెళ్లలో రేవంత్, ఖమ్మంలో భట్టి, సంగారెడ్డి జగ్గారెడ్డి పాదయాత్ర
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రాంభించనున్నారు. దీనికి సీడబ్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ పాదయాత్ర మధ్యాహ్నం 12.30 ప్రారంభం కానుంది. తొలుత చేవెళ్ల మండలం ముడిమ్యాల చౌరస్తా కూడలిలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
చేవెళ్లలోకి ఇంధిరాగాంధీ విగ్రహం వరకు వరకు పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 10 కి.మీ మేర సాగే ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సంగారెడ్డిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు.

తెలంగాణకు రాహుల్ రాక
కేంద్రం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. జనవరి 30వ తేది నుంచి 15 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ 2022 ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణకి రానున్నారు. ఒక్కరోజు పాదయాత్రలో పాల్గొంటారు. రాహుల్ వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది.

డిజిటల్ మెంబర్‌షిప్
డిజిటల్ మెంబర్‌షిప్‌కు టీపీసీపీ శ్రీకారం చుట్టింది. జనవరి 26వ తేది నాటికి సుమారు 30 లక్షల సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ఆపార్టీ నేతలు వెల్లడించారు. కేసీఆర్ పాలనలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్విర్యం చేశారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థలకు నిధులు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. నిధులు లేక సర్పంచులు, జడ్పీటీసీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నియోజవర్గాల వారిగా ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications