బ్రహ్మోత్సవాల్లో 11 ఏళ్ల బాలిక మృతి, ఆలయం ముందు ఆందోళనతో ఉద్రిక్తత!
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్లిన ఓ చిన్నారి విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా, చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ షాక్.. అపస్మారక స్థితిలోకి బాలిక
కొడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా అలంకరించారు. అయితే ఆలయ మెట్లపై ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ లైటింగ్ తాలూకు వైర్ మెడకు తగిలి మధుశ్రీ అనే బాలిక కుప్పకూలిపోయింది. అప్పటివరకు భక్తి భావంతో డ్యాన్స్ చేసిన బాలిక షాక్ తో అపస్మారక స్థితిలోకి చేరింది.

బాలిక మృతి, గుడి ముందు ఆందోళన
స్థానికులు, తండ్రి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలిక ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇక మధుశ్రీ మరణ వార్త విన్న గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలిక మృతితో బాధిత కుటుంబం ఈ ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వారిపై చర్యలకు బాధిత కుటుంబం డిమాండ్
ఆలయ బ్రహ్మోత్సవాలలో నిర్లక్ష్యంగా విద్యుత్ దీపాలంకరణ చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆలయ కమిటీ సభ్యుల పైన కూడా చర్యలు తీసుకోవాలని వారు గుడి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు
బాలిక తండ్రి తమ బిడ్డ మృతి చెందడానికి, ఆలయ కమిటీ, విద్యుదీకరణ పనులు చేసిన కాంట్రాక్టర్ బాధ్యులని పేర్కొంటూ, వారి పైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, విచారణ చేస్తున్నారు. గుడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాలిక తల్లిదండ్రులు బంధువులు, బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో బ్రహోత్సవాల వేళ విషాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications