ప్రాణం తీసిన పెంపుడు కుక్క గోరు.. రేబిస్ లక్షణాలు కనిపిస్తే బతకడం కష్టమేనా..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో ఓ మనిషిగా వాటిని ట్రీట్ చేస్తున్నారు. ఇంక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పెంపుడు కుక్కలు సహజంగా కనిపిస్తుంటాయి. పిల్లల సంరక్షణ, ఇంటి కాపలాలో కుక్కలు నిమగ్నమవుతాయి. కుక్కలు తమ యజమాని, కుటుంబంపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే మిగతా సాధు జంతువుల కన్నా శునకాలనే పెంచుకునేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అయితే కుక్కలతో ఓ సారి ప్రమాదం పొంచి ఉంటుంది. వాటికి ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ వేయకపోతే పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు భావించాలి.
తాజాగా కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారానికి చెందిన ఓ యువకుడు పెంపుడు కుక్క గాటు కారణంగా మృతి చెందాడు. ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది. పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని ఓ నిండు ప్రాణం బలైంది. ఏడూళ్లబయ్యారానికి చెందిన సందీప్(25) 2 నెలల క్రితం ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. అయితే ఓ సారి అది తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క గోరు సందీప్ కు గుచ్చుకుంది. తండ్రికి చికిత్స చేయించిన సందీప్ తన గాయాన్ని అశ్రద్ధ చేశాడు. గోరు గుచ్చుకుంటే ఏం అవుతుందిలే అని నిర్లక్ష్యం చేశాడు. అయితే ఇటీవల రేబీస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
రేబిస్ లక్షణాలు ఇవే..
రేబిస్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది కుక్కలు, పిల్లులు, గబ్బిలాల నుంచి మనిషికి సోకుతుంది. ఆ జంతువుల లాలాజలం ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాటు వేసిన చోట దురద, నొప్పి రావడం రేబిస్ మొదటి లక్షణాలలో ఒకటిగా చెప్తారు వైద్యులు. కాటు లేదా గీతలు పడిన ప్రదేశంలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. నొప్పిగా ఉండటం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
ఆ తర్వాత జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రేబిస్ జ్వరం, అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఆ తర్వాత అధికంగా లాలాజలం రావడం, మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నీళ్లు తాగడానికి ప్రయత్నించినప్పుడు గొంతులోని కండరాలు పక్షవాతానికి గురై, ఊపిరాడనట్లు అవుతుంది. ఆ తర్వాత హైడ్రోఫోబియా (నీటి భయం) ఉంటుంది. నీటిని చూసినా, దాని గురించి ఆలోచించినా భయపడటం రేబిస్ ప్రధాన లక్షణంగా ఉంటుంది.

రేబిస్ ప్రాణాంతక వ్యాధి కాబట్టి ఒక జంతువు కాటు లేదా గీతలు పడినప్పుడు వెంటనే గాయాన్ని శుభ్రం చేసి, వైద్య నిపుణుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తి రక్షణ లభిస్తుందని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications