అయ్యో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి..
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పెద్ద శంకరంపేటలో జరిగింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతోపాటు వారి ఇద్దరి పిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి కామారెడ్డి బైక్ పై వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు స్పష్టం అవుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తూ ఓ కుటుంబం అనంత లోకాలకు వెళ్లిపోయింది. బైక్ పై వెళ్తున్న ఆ కుటుంబాన్ని ఓ గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట వద్ద జరిగింది. మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామ వాసులుగా గుర్తించారు.
మృతులు మాగి గ్రామానికి చెందిన లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు. డిసెంబర్ 14న జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెద్ద శంకరంపేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి వివరించారు.

మరోవైపు డిసెంబర్ 14 న తెలంగాణలోని పంచాయితీల్లో రెండో విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైక్స్ పేనే వెళ్తున్న క్రమంలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్టేషన్ ఘన్ పూర్ లో జరిగింది.












Click it and Unblock the Notifications