ప్రత్యూష పేరిట ఫ్లాట్ రిజిస్ట్రేషన్: కానుకగా ఇవ్వాలని తండ్రికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సవతి తల్లి చాముండేశ్వరి చేతిలో చిత్రహింసలకు గురైన యువతి ప్రత్యూష పేరిట ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి హైకోర్టుకు తెలిపారు.
తన తల్లి పేరున ఉన్న ఆ ఫ్లాట్‌ను ప్రత్యూష పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, ఆమెకు కానుకగా అందజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తండ్రి ఈ మేరకు స్పందించారు.
కాగా, ఆ ప్రకటనను నమోదు చేసిన ధర్మాసనం.. రిజిస్ట్రేషన్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) శరత్‌కుమార్‌కు సూచించింది.

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
సోమవారం ప్రత్యూష తండ్రి కోర్టుకు హాజరయ్యారు. ఎస్‌జీపీ వాదనలు వినిపిస్తూ.. తండ్రి పేరుమీద ఉన్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆ యువతి తండ్రి అంగీకరించారని.. సంక్రాంతి సెలవులలోపే ఆ ప్రక్రియ పూర్తి చేస్తానన్నారని తెలిపారు.
రిజిస్ట్రేషన్ అయ్యాక.. ఆ ఫ్లాట్ అద్దె ఆ యువతికి చెందేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌జీపీకి హైకోర్టు సూచించింది. ఆ ఫ్లాట్‌లో ఆద్దెకుండే వారు ప్రత్యూషతో ఒప్పందం చేసుకునేలా చూడాలని కోర్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications