కేసీఆర్ దీక్షకు ఏడేళ్లు: ఘనంగా ‘దీక్షా దివస్’

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు తెలంగాణ కోసం దీక్ష చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టిఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ పేరిట వేడుకలను ఘనంగా నిర్వహించాయి. తెలంగాణతోపాటు ఢిల్లీ, ఇతర దేశాల్లోని ఎన్నారైలు కూడా దీక్షా దివస్‌ను జరుపుకోవడం విశేషం.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 'దీక్షా దివస్' కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎంపీలు కేకే, కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, సుమన్‌తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి ఎంపీలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసిందని గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న రాష్ట్రాన్ని అందరం కలిసి బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్షకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రాబోయే 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటదని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్ దీక్ష చరిత్రలో నిలిచిపోతుంది: హరీశ్

ఏడేళ్ల క్రితం కేసీఆర్ చేసిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనాటి దీక్షతో ఢిల్లీ పునాదులు కదిలాయని, అహింసా మార్గంలోనే కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు.

TRS celebrates deeksha diwas

కాగా, కేసీఆర్‌‌ను దీక్ష చేయవద్దన్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలకులు ఆయన ప్రాణం తీస్తారనే ఉద్దేశంతోనే దీక్ష చేయవద్దన్నామని చెప్పారు. టి కాంగ్రెసోళ్లంతా పనికిమాలినోళ్లని అన్నారు. ఈ సందర్భంగా సోనియాకు దండం, కాంగ్రెస్ నాయకులకు గండం అని వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివస్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారని నాయిని నర్సింహారెడ్డి గుర్తు చేశారు. పేదల అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని ఆత్మస్థైర్యంతో దీక్ష చేశారన్నారు.

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టారు. రక్తదాన శిబిరాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఇక నల్లగొండ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS leaders celebrated deeksha diwas on Tuesday(November 29th).
Please Wait while comments are loading...