సాగర్ ఉపఎన్నిక: వీడిన సస్పెన్స్... టీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు..? పోటీ చేసేది ఎవరంటే...
వ్యూహాత్మకమో... లేక ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధమో తెలియదు గానీ సాగర్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ చివరిదాకా సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఎట్టకేలకు 'నోముల భగత్'కే సాగర్ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల భగత్‌కు స్వయంగా బీఫామ్ అందజేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(మార్చి 30) భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్...
సాగర్ ఉపఎన్నిక అభ్యర్థి కోసం టీఆర్ఎస్ పార్టీ చాలా పేర్లనే పరిశీలించింది. మన్నె రంజిత్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,తేరా చిన్నపరెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలా తదితర పేర్లు వినిపించాయి. మొదట్లో నోముల భగత్‌కే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ... ఆ తర్వాత అనూహ్యంగా ఈ పేర్లు తెర పైకి వచ్చాయి.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దన్న వ్యూహంతో చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరన్న దానిపై కేసీఆర్ సస్పెన్స్ క్రియేట్ చేశారు. తద్వారా పార్టీలోని అసంతృప్తులకు,టికెట్ ఆశించి భంగపడ్డవారికి బీజేపీ గాలం వేయకుండా జాగ్రత్తపడ్డారనే చెప్పాలి. చివరి నిమిషంలో నోముల భగత్ పేరునే ఖరారు చేయడంలో ఇదే వ్యూహం కనిపిస్తోంది.

బీజేపీ అభ్యర్థిగా ఎంసీ కోటరెడ్డి...?
మరోవైపు టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు ఎంసీ కోటిరెడ్డి సోమవారం(మార్చి 29) బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న ఆయన... హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నేడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. సాగర్ ఉపఎన్నిక టికెట్‌పై హామీ లభించాకే ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనిపై బీజేపీ ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రేపే నామినేషన్లకు చివరి రోజైన నేపథ్యంలో... కోటిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనకే టికెట్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు ముగ్గురి నామినేషన్లు...
ఇప్పటివరకూ కాంగ్రెస్,టీడీపీ మినహా ప్రధాన పార్టీలేవి తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగడంతో బలమైన నేత కోసం ఇరు పార్టీలు కసరత్తులు చేశాయి. చివరకు నోముల భగత్ వైపే టీఆర్ఎస్ మొగ్గు చూపగా... ఎంసీ కోటిరెడ్డికి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు చివరి రోజైన మంగళవారమే(మార్చి 30) నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
టీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. అటు జానారెడ్డి.. నియోజకవర్గంలో తనకున్న పలుకుబడి,సీనియారిటీ మరోసారి తననే గెలిపిస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంతనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications