జగన్ దీక్ష ఎఫెక్ట్: దిష్టిబొమ్మ దహనం, వైసీపీ పార్టీ ఆఫీస్‌పై టీఆర్ఎస్ దాడి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు నిరసనగా కర్నూలులో వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తున్న జలదీక్ష రెండు రోజుకు చేరుకుంది. జగన్ చేపట్టిన దీక్షకు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంటే తెలంగాణలో మాత్రం వ్యతిరేకత ఎదురవుతోంది.
అంతేకాదు తెలంగాణలో వైసీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం వైయస్ జగన్ జలదీక్షకు వ్యతిరేకంగా పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు.
ఈ దాడిలో వైసీపీ కార్యాలయంలోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. వైసీపీ కార్యాలయంపై దాడితో ఆగ్రహం చల్లారని టీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ అధినేత వైయస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న మహబూబ్ నగర్ వైసీపీ కార్యకర్తలు పోలీసులకు ఫోన్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు. కాగా, కర్నూలులో వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష విజయవంత మైనట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు.
జగన్ దిష్టిబొమ్మ దహనం
ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ కూడలిలో వైసీపీ అధినేత జగన్ దిష్టి బొమ్మను స్థానిక టీఆర్‌ఎస్ నేత మాధవరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. అనంతరం చౌరస్తాలో ఉన్న పార్టీ జెండా దిమ్మెను కూల్చివేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ జగన్ చేస్తున్న దీక్షను దొంగ దీక్షగా అభివర్ణించారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కడుతుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ నేత జగన్ తోడు దొంగలుగా వ్యవహరిస్తూ తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
శ్రీచైతన్య స్కూలుపై దాడి
నల్గొండ జిల్లా సూర్యాపేటలోని శ్రీచైతన్య స్కూలుపై విద్యార్థి సంఘాలు మంగళవారం దాడికి పాల్పడ్డాయి. స్కూలుకు సంబంధించి పదో తరగతి ఫలితాలు వెల్లడించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు పాఠశాలలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
దీనిపై సమచారం అందుకున్న పోలీసులు స్కూలు వద్దకు చేరుకుని తల్లిదండ్రులు, విద్యార్ధులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications