వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతెంత దూరం.. చానా దూరం: ఇదీ టీఆర్ఎస్‌లో నామినేటెడ్ దుస్థితి

రాజకీయ నాయకులకు నామినేటెడ్ పోస్టులపై మోజెక్కువే. అందునా అధికార పార్టీ వారి సంగతి చెప్పనవసరమే లేదు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజకీయ నాయకులకు నామినేటెడ్ పోస్టులపై మోజెక్కువే. అందునా అధికార పార్టీ వారి సంగతి చెప్పనవసరమే లేదు. మూడేళ్ల క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లో నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయమై విభిన్నమైన పరిస్థితి నెలకొన్నది.

రాష్ట్ర సాధన ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్నా పదవులు రాలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పదవులు దక్కినా తగిన గుర్తింపు లేదన్న భావనతో మరికొందరు నేతలు అంటుంటారు. పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందంటూ ఇటీవల టీఆర్‌ఎస్‌ తాండూరు మైనారిటీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు. తన సీనియారిటీని గుర్తించైనా గుడి చైర్మన్‌ పదవి ఇవ్వకుండా డైరెక్టర్‌ పోస్టుతో సరిపెట్టారని పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన మరో నేత ప్రమాణ స్వీకారం చేయకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. నామినేటెడ్‌ పదవులే కాదు పార్టీ సంస్థాగత పదవులైనా రావడం లేదని మరికొందరు నేతలు వాపోతున్నారు.

TRS leaders expecting nominated posts in government

మూడేళ్లలో మూడు ప్లీనరీలు

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు ప్లీనరీలు జరిగాయి. గత ఏప్రిల్‌లో జరిగిన 16వ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఆవిర్భావానికంటే ముందు నియమించిన పార్టీ కమిటీలు 2015లోనే రద్దయ్యాయి. 2015లో ఒకసారి, ఈ ఏడాది మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాలూ జోరుగా సాగాయి. కానీ సంస్థాగత పదవుల నియామకాలు మాత్రం చేపట్టలేదు.

వాస్తవానికి పార్టీ నిబంధనావళి ప్రకారం రెండేళ్లకోసారి సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.. ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ, బహిరంగ సభలు నిర్వహిస్తున్న అగ్రనాయకత్వం సంస్థాగత నిర్మాణం, కమిటీల విషయాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే.. 'సంస్థాగతంగా పార్టీ కమిటీలను నియమించాలని టీఆర్ఎస్ అధినేత - సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తేగల నాయకులెవరూ లేరు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే గడువున్నందున గ్రామ గ్రామాన పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. పార్టీకి క్షేత్రస్థాయి శ్రేణులే కీలకం. వారికి కనీసం పార్టీ పదవులు కూడా ఇవ్వకుండా.. వారి నుంచి పార్టీకి సేవలు ఆశించలేం కదా' అని టీఆర్‌ఎస్‌ నేత ఒకరు పేర్కొనడం గమనార్హం.

TRS leaders expecting nominated posts in government

గత ఏడాది నుంచి కేసీఆర్ ఎన్నికల వ్యూహానికి పదును

రాజకీయ చాతుర్యానికి మారుపేరుగా నిలిచే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 2016 నుంచి ప్రణాళికలు సిద్ధంచేస్తూ వచ్చారు. వాటిలో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలు, మేకలు, మత్స్యకారులకు చేపల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు విడతల్లోనూ రూ.17 వేల కోట్ల పై చిలుకు పంట రుణాలను మాఫీ చేసేశారు.

తాజాగా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి రైతుకు ఎకరాకు రూ.4000 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో అందజేస్తామని, రైతులు రుణాలు చేయాల్సిన అవసరం లేదని సగర్వంగా ప్రకటించారు. అందుకు విధి విధానాలేమీ ఖరారైన దాఖలాలేవీ కనిపించకున్నా.. గ్రామ గ్రామాన రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడంపై ద్రుష్టి సారించారు. ఆయా కమిటీలకు నిర్దేశించిన పనులను వ్యవసాయ శాఖ మార్గదర్శకాల రూపంలో జారీ చేసింది.

వాటి ఆనుపానులు, వాస్తవ లక్ష్యాలు తెలిస్తే గానీ రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు కారణాలు తెలియవు. సర్వం రైతు సమన్వయ సమితులే నిర్ణయం తీసుకుంటాయని పేర్కొనడంతో కొత్త తరహా రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల వేళ రైతులను సమన్వయం చేసుకోవడానికే ఈ సమితులు ఉపకరిస్తాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అవునన్నట్లు కమిటీల నియామకంలో టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మాటే వేదవాక్కుగా మారడం దీనికి కారణం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు, సంఘాల నేతలకు ఈ కమిటీల్లో చోటు కల్పించడంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తేవి కావన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంటే త్వరలో జరిగే ఎన్నికల్లో సంస్థాగతంగా గ్రామస్థాయిలో పని చేసే వారిని టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధం చేసుకుంటున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

TRS leaders expecting nominated posts in government

మారిన నిబంధనలతో సమస్య

16వ ప్లీనరీలో టీఆర్‌ఎస్‌ నిబంధనావళికి కొన్ని సవరణలు చేశారు. వాటి ప్రకారం టీఆర్‌ఎస్‌కు జిల్లా కమిటీలేవీ ఉండవు. వాటికి బదులుగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నేతృత్వంలో పనిచేస్తాయి. అంటే జిల్లా స్థాయిలో పార్టీకి నాయకత్వం వహించే వారితో పనేమీ లేదు. ఎమ్మెల్యేలే జన సమీకరణ, అవగాహన తదితర కార్యక్రమాలకు సారథ్యం వహిస్తారని, దీనివల్ల అసలుకే ముప్పు వస్తుందన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఇంతకుముందు జిల్లా కమిటీల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమైన పార్టీ నాయకులకు స్థానం ఉండేది. వారికి జిల్లా స్థాయి పదవితో గుర్తింపు ఉండేది. కానీ ఇక నుంచి టీఆర్‌ఎస్‌లో జిల్లాకు ఓ ఇద్దరు ముగ్గురు ఇన్‌చార్జులు మాత్రమే ఉండనున్నారు. దానివల్ల ఎక్కువ మందికి పార్టీ కమిటీల్లో స్థానం లేకుండా పోతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయం కూడా అతీగతీ లేకుండాపోయింది. పోలిట్‌బ్యూరో సైతం మూడేళ్లుగా భర్తీ కాలేదు.

TRS leaders expecting nominated posts in government

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కొంత ఊపందుకున్నది. వ్యవసాయ మార్కెట్లు, దేవాలయాల పాలకమండళ్లు సహా రాష్ట్రస్థాయిలో నలభైకి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మునుపెన్నడూ లేని నూతన కార్పొరేషన్లనూ సృష్టించారు. తొలుత భర్తీ చేసిన చైర్మన్లకే కార్యాలయాలు, చేయడానికి కొంత పని ఉంది. కానీ తర్వాత కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు జరిగినా, వారు కూర్చోవడానికే కార్యాలయాలు లేవు. అసలు వారి విధులేమిటో, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. పార్టీ అధినేతకు దగ్గర అని పేరు ఉన్న ఓ నాయకుడికి ఇటీవల ఓ కార్పొరేషన్‌ పదవి దక్కింది.

కానీ ఆయనకు కూర్చోవడానికి క్యాబిన్, సీటు లేక ఆ శాఖ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సీటే వినియోగించుకుంటున్నారు. దీంతో ఆ అధికారి కినుక వహించారు. ఇక మరో సీనియర్‌ నేతకు కార్యాలయం ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం కావడంతో.. కొన్నాళ్ల పాటు సంబంధిత శాఖ మంత్రి పేషీని ఉపయోగించుకున్నారు. చివరకు అటు వైపు వెళ్లడమే మానేశారు. దీంతో పదవులు వచ్చాయన్న సంతోషం కూడా లేకుండా పోయిందని నేతలు వాపోతున్నారు.

English summary
TRS leaders expecting Nominated posts in government. But State government also appointed some of corporation chairmans and directors while most of the 'nominated' leaders didn't idea what would they duties. At the same time TRS leader ship canceled District Organisation commities replaced by MLA Constiuency committes. Party leaders concern their fate in future doubt full
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X