తెలంగాణ కోసం రాలేదు, కానీ బంగారు టికి ఎలా ముందుకొచ్చారు?
హైదరాబాద్: టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున పెద్ద, చిన్నస్థాయి నేతలు కారు ఎక్కుతున్నారు. ఇది ఎప్పటి నుంచో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వారిని అసంతృప్తికి గురి చేస్తోందన్న వాదనలు వినిపిస్తోంది.
బంగారు తెలంగాణ కోసం చేరుతున్నామని చెబుతున్న నేతల మాటల్లో వాస్తవం ఎంత అని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు మదనపడుతున్నారని చెబుతున్నారు.
ఏడాది కాలంగా టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎక్కువ మంది నేతలు వచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, డి శ్రీనివాస్ వంటి కీలక నేతలు తమ తమ పార్టీలు వదిలి బంగారు తెలంగాణ కోసమంటూ కారు ఎక్కారు.

మరికొద్ది రోజుల్లో మరికొంతమంది ముఖ్య నేతలు వస్తారనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతోంది. బంగారు తెలంగాణ కోసమే తాము టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు నాయకులు చెబుతున్నారు.
అయితే, ఎప్పటి నుంచో టిఆర్ఎస్‌లో ఉన్న వారు మాత్రం.. వారు బంగారు తెలంగాణ పేరు చెప్పినప్పటికీ కేవలం తమ ఆస్తులు, వ్యాపారాలు రక్షించుకునేందుకు అలాగే, పదవులు అనుభవించేందుకు వస్తున్నారని భావిస్తున్నారంటున్నారు.
పద్నాలుగేళ్లుగా తెలంగాణ కోసం ఉద్యమిస్తుంటే.. రాని నేతలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక బంగారు తెలంగాణ కోసం వస్తున్నామని చెబుతుంటే నమ్మేదెలా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి!
కెసిఆర్, హరీష్ రావు వంటి నేతలు తమ పదవుల కోసం రాజీనామాలు చేశారని, కానీ ఇప్పుడు చేరుతున్న వారిలో పలువురు ఎంత డిమాండ్ చేసినా పదవులు వదులుకోలేదని, అలాంటప్పుడు బంగారు తెలంగాణ కోసం అంటే ఎలా నమ్మేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కోసం టిఆర్ఎస్‌లో కనీసం సగం పోరాడని నేతలు ఇప్పుడు వారు వస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే, అనుభవం ఉన్న నేతలు పార్టీలో చేరుతున్నారని, వారి సేవలతో బంగారు తెలంగాణ వైపు కెసిఆర్ అడుగులు వేస్తున్నారనే వారూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications