ఆదుకుంటాం: రోహిత్ ఆత్మహత్యపై తొలిసారి నోరువిప్పిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వర్సిటీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, దానిపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు.
శనివారం ఆయన రోహిత్ ఆత్మహత్యపై స్పందించారు. రోహిత్ ఆత్మహత్య విషయంపై గతంలోనే తమ పార్టీ ఎంపీలు బాల్క సుమన్, కవిత స్పందించారని ఆయన గుర్తు చేశారు. ఉద్వేగాలు ఎగసిపడుతున్న ఈ తరుణంలో డిజాస్టర్ టూరిజం చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.
యూనివర్సిటీలు విద్యాకేంద్రాలుగా ఉండాలని, కానీ కొన్ని సందర్భాల్లో రాజకీయాలు తోడైతే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. యూనివర్సిటీలో వాతావరణం ప్రస్తుతం ఉద్వేగంగా ఉందని, తాము జోక్యం చేసుకోవడం వల్ల ఉద్వేగం ఎక్కువై, ఉద్రేకాలు రేగే ప్రమాదముందన్నారు.

అందుకే తాము ఉద్రేకాలను మరింత రెచ్చగొట్టే పరిస్థితులను కల్పించవద్దనే (వీఆర్ నాట్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్) ఉద్దేశంతోనే సంయమనంగా ఉన్నామని ఆయన చెప్పారు. వర్సిటీలో యువత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారిని ఇంకా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం మంచిదికాదని ఆయన సూచించారు.
రోహిత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు. ఏది ఎలా ఉన్నా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా రోహిత్ వేముల కుటుంబాన్ని కచ్చితంగా ఆదుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications