డ్రగ్స్ మత్తులో ఊగుతుంది బీజేపీ, కాంగ్రెస్ నేతల పిల్లలే ..! : బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ బంజారాహిల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడకం బయటపడటంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు . ఇప్పటికే పలువుని అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేశారు. పబ్ నిర్వహకులు జాతీయ పార్టీ నేతలని వ్యాఖ్యానించారు. ఓనర్ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకు అభిషేక్ అని బాల్క సుమన్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీజేపీ తరపున ఉప్పల శారద పోటీచేసినట్లు గుర్తు చేశారు. అభిషేక్ ఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొన్నారని వాటికి సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు

పబ్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు..
పుడింగ్ అండ్ మింక్ పబ్ పట్టుబడిన వారంతా కాంగ్రెస్ , బీజేపీ నేతల బంధువులు, పిల్లలే అని బాల్క సుమన్ విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ పబ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేనల్లుడి పేరు కూడా ఉందని తెలిపారు. జాబితాలో 24వ పేరుగా రేవంత్ రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఉందన్నారు. ప్రస్తుతం అతను కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. పోలీసులు వెల్లడించిన వారి పేర్లలో ఇరుపార్టీలకు చెందిన పిల్లలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.

డ్రగ్స్ మత్తులో బీజేపీ, కాంగ్రెస్ నేతల పిల్లలు.?.
తెలంగాణలో డ్రగ్స్ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఇరుపార్టీల బండారం బయటపడిందని విమర్శించారు. ఉరితీయాలి, షూట్ చేయాలంటూ అవాకులు చవాకులు పేలారు. ఇప్పుడు ఎవర్నీ సూట్ చేయాలో... ఎవర్నీ ఉరి తీయాలో సైకో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. బీజేపీ , కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపార్టీ నేతల పిల్లలు డ్రగ్స్ మత్తులో తూగుతున్నారో.. రుజువైందని చురకులు అంటించారు. నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రేవంత్ రెడ్డి , బండిసంజయ్ రాజీనామా చేయాలని సుమన్ డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి, బండి రాజీనామా చేయాలి..
బీజేపీ , కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు మానాలని బాల్క సుమన్ మండిపడ్డారు. డ్రగ్స్ అమ్మేది కాంగ్రెస్, బీజేపీ నాయకుల బంధువులు, సన్నిహితులేనని ఆరోపణలు గుప్పించారు . కేసు విచారణ పూర్తియితే మిగతా వారి పేర్లు కూడా బయటకు వస్తాయన్నారు. తెలంగాణను డ్రగ్స్‌లో ముంచుతుంది బీజేపీ, కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు. డ్రగ్స్ కట్టడిపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. మారకద్రవ్యాలపై సీఎం కేసీఆర్ ఉక్కు పాదం మోపారని చెప్పారు. ఈ కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని పోలీసులను కోరారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications