ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే విధించాలని కోరతూ వీరిద్దరూ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
వాదనలు విన్న హైకోర్టు.. డిసెంబర్ 13వ తేదీ వరకు సిట్ నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణ వరకు వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్‌కి మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ ద్వారా నోటీసు జారీ చేస్తే.. విచారణకు హాజరైన వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం కూడా పోలీసులకు ఉంటుంది.
కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలకు ఇటీవల బెయిల్ లభించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications