ఇక ఢిల్లీ కేంద్రంగా పోరాటం - గోయల్ కు అహంకారం : 4 నుంచి ఉద్యమ కార్యాచరణ - కేటీఆర్..!!
టీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం పోరాటం ముదురుతోంది. ఇక, ఢిల్లీ కేంద్రంగా నిరసన ర్యాలీలకు టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 4వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో నిరసనలు ప్రారంభించి 11న ఢిల్లీలో భారీ ర్యాలీకి సిద్దం అవుతోంది. యసంగి ధాన్యం కొనుగోలు డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ కార్యచరణను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ప్రజలను దోచి కార్పొరేట్లకు ధారదత్తం చేస్తోందని మంత్రి ఆరోపించారు.

వడ్లు కొంటారా ..లేదా సూటిగా చెప్పండి
కేంద్ర ప్రభుత్వానికి తల - తోక లేదంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ కరెక్టా? సిల్లీ బీజేపీ నేతలు కరెక్టా? వడ్లు కొంటారా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అనే నిబంధనలు పెట్టకుండా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని తాము కోరామన్నారు. మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా సతాయించారని, ఎందుకు వచ్చారంటూ అవమానించారని కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు అహంకారం ఎక్కువ అని..తెలంగాణ రైతులను అవమానించిన వారిని వదిలేది లేదని కేటీఆర్ స్పష్టం చేసారు.

మండల కేంద్రాలు టు ఢిల్లీ కేంద్రంగా
యాసంగిలో వడ్లు వేయొద్దని రైతులకు చెప్పామన్న కేటీఆర్.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించామన్నారు. బీజేపీ నేతలు వడ్లు వేసుకోవాలని సూచించారని గుర్తు చేసారు. ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరముందన్నారు. ఎంత ధాన్యమైనా కొంటామని కేంద్రమంత్రి గతంలోనే హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కేంద్రం తీరుకు నిరనసనగా చేపట్టనున్న కార్యాచరణను మంత్రి ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా.. ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.

ఉద్యమ కార్యాచరణ ఇలా..
ఏప్రిల్ 6న నాలుగు జాతీయ రహదారులపై రాస్తారోకో చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు మొత్తం 33 జిల్లాల్లోనూ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 8న ప్రతి గ్రామంలో రైతు ఇంటిపై నల్లజెండా, ప్రతి ఊరిలో నిరసన ర్యాలీలు, కేంద్రం దిష్టిబొమ్మల దహనం నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 11న ఢిల్లీలో రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేస్తామని ప్రకటించారు. అందులో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం పాల్గొంటారన్నారు. ఏప్రిల్ 8 వరకు పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications