TS Polls: చార్మినార్ రిజల్ట్ ఫస్ట్: మధ్యాహ్నం 1 గంటకల్లా అన్ని సీట్లపై స్పష్టత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 3 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కౌంట్ చేస్తారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా చార్మినార్ సెగ్మెంట్ ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా రాష్ట్రంలోని అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా, వీరిలో 2,32,59,256 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉన్న 2290 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఆదివారం సాయంత్రంలోగా తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి 1.80 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడతాయి. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైన ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది.
కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, పఠాన్ చెరు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400కుపైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కుపైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంను మూడుసార్లు లెక్కిస్తారు.
నవంబర్ 30న ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రతపర్చారు. ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆదివారం జరగనున్న కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రతా దళాలు మోహరించాయి. 40 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. పలు ఆంక్షలు కూడా విధించారు. ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు నిషేధించారు. మద్యం దుకాణాలు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మూతపడనున్నాయి.












Click it and Unblock the Notifications