కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ తాజా నిర్ణయం - పథకాలు వారికే..!!
తెలంగాణ ప్రభుత్వం పధకాల అమలులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ పాలన పైన స్పష్టమైన దిశా నిర్దేశం చేసారు. పథకాల అమలుకు రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక పైన చర్చ జరిగింది. రేషన్ కార్డులతో పాటుగా పథకాల దరఖాస్తుల స్వీకరణ పైన కార్యాచరణ డిసైడ్ చేసారు.
రేషన్ కార్డు ప్రామాణికంగా: తెలంగాణలో అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ వరకు రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని నిర్వహించి, ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు.

ఈ పథకాలకు విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ప్రస్తుతానికి తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు స్పష్టం చేసారు. కొత్త రేషన్ కార్డులకు, రైతుబంధుకు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలిపారు. రేషన్‌కార్డు ఉన్నవారి అర్హతల ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఆందోళన చెందొద్దు: పథకాలకు సంబంధించి దరఖాస్తుకు సమయం తక్కువగా ఉన్నదని ఆందోళన చెందొద్దని ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు. ఇది చివరి అవకాశం కాదని..నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేనివారి నుంచి తర్వాత దరఖాస్తు తీసుకుంటామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి అర్హతను బట్టి చిత్తశుద్ధితో దరఖాస్తు తీసుకుంటామని తెలిపారు.
ప్రజా పాలనలో భాగంగా ప్రతి గ్రామం, వార్డు, డివిజన్, పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికారుల బృందం ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది. గ్రామాలు, తండాలు, అనుబంధ గ్రామాల్లోకి కూడా వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు. దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు.
పాదర్శకంగా అమలు: ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించటానికి ముందు రోజు.. ఆ గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు పరిధిలో దండోరా వేయించి ప్రచారం నిర్వహించాలి. అలాగే.. మహిళల కోసం ప్రకటించిన పథకాలే ఎక్కువ ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దరఖాస్తులు స్వీకరించడానికి మహిళలకు కనీసం రెండు కౌంటర్లు, పురుషులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చే దరఖాస్తులన్నింటినీ కంప్యూటర్‌లో పొందుపరచాలనిప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఏరోజుకారోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలని సూచించింది.












Click it and Unblock the Notifications