తెలంగాణలో తారక రామారావు రాజ్యం రావాలి : మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో తారాక రామరావు రాజ్యం రావాలని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడిగిన వారందరికీ వరాలు ఇచ్చే దేవుడు మన రామారావు ( కేటీఆర్ ) అన్నారు . మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్ కార్పొరేషన్లలో రూ. 303 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సంద్భంగా కేటీఆర్‌పై మల్లారెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు.

తారక రామారావు రాజ్యం రావాలి
రాష్ట్ర ప్రజలకు వరాలు ఇచ్చే దేవుడు మంత్రి తారక రామారావు అని మల్లారెడ్డి అన్నారు. మనకు కన్పించే రూపం, దైవం, దేవుడు మన రామారావు అని పేర్కొన్నారు. పెద్ద మనసున్న మహారాజు అని కోనియాడారు. అడిగినవన్నీ ఇస్తూ.. పేదలకు వెన్నంటి ఉండే గొప్ప వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్నారు. ప్రజల బాగు కోసం తారక రామారావు రాజ్యం రావాలని ఉందన్నారు మల్లారెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

బీజేపీ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వమని
దేశంలో బీజేపీ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వమని మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులను తరిమి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిలదీయాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

సాయి ప్రియా కాలనీ వాసులకు అన్యాయం
సాయి ప్రియా కాలనీ వాసులకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి మల్లారెడ్డి. పేదలను మోసం చేసిన బిల్డర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో వేయాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువుల సుందరీకరణ కోసం నిధులు విడుదల చేయాలని ఈసంద్భంగా మంత్రి కేటీఆర్ ను మల్లారెడ్డి కోరారు.

జవాహర్ నగర్ వాసులకు పట్టాలు
జవాహర్ నగర్ ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి జీవో 58, 59 ద్వారా పట్టాలు ఇప్పిస్తామని మల్లారెడ్డికి, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. డంప్ యార్డ్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంచినీటి సరఫరాకు రూ. 240 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పార. మురుగు శుద్ధికోసం రూ. 240 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications