అగ్రస్థానంలో తెలంగాణ - అనూహ్య వృద్ధి, ఆర్బీఐ నివేదికలో వెల్లడి..!!
ఆర్దిక ప్రగతిలో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తున్నదని 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వెల్లడించింది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అనూహ్య వృద్ధి సాధించినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ తన స్థానం సుస్థిరం చేసుకుంది. తలసరి ఆదాయంలో దక్షిణాధి రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది.
అనూహ్య వృద్ధి: రాష్ట్ర ఆవిర్భావం సమయంలో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్‌డీపీ.. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరినాటికి అనూహ్యంగా రూ.13.3 లక్షల కోట్లకు ఎగబాకింది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ తిరుగులేని ప్రగతిని చూపుతున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162 కోట్లుగా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,75,443 కోట్లకు పెరిగింది. తద్వారా ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5 శాతంగా నమోదైంది. తర్వాతి స్థానంలో కర్ణాటక తలసరి ఆదాయం రూ.2, 65,623గా ఉంది. మూడో స్థానంలో తమిళనాడు రూ.2,41,131 కాగా, నాలుగో స్థానంలో కేరళ రూ.2,30,601 ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో పర్ క్యాపిటా ఇన్‌కమ్ రూ.2,07,771గా ఉంది.

ఆర్బీఐ నివేదికలో: రాష్ట్రాల ఆర్దిక వ్యవస్థ బలాన్ని గుర్తించేందుకు ఆర్బీఐ ప్రధానంగా జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్టు ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ లెక్కల్లోనో తెలంగాణానే అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి 25.3 శాతమేనని తేల్చింది. వడ్డీలకు 11.3 శాతాన్ని చెల్లిస్తూ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. దక్షిణాదిలోని మిగిలిన 4 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ శాతమే రుణాలు తీసుకున్నాయి. కర్ణాటకలో జీఎస్‌డీపీ-రుణాల నిష్పత్తి 27.5 శాతంగా ఉండగా..తమిళనాడులో 27.7%, ఏపీలో 32.8%, కేరళలో 37.2 శాతంగా అధికారిక లెక్కల ప్రకారం రికార్డు అయింది.

తలసరి వృద్ధి రేటు : దక్షిణాదిన అత్యధిక పన్ను రెవెన్యూ ఉన్న రాష్ట్రాల్లో రూ,1,26,644 కోట్లతో తమిళనాడు తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కర్ణాటక రూ.1,11,494, తెలంగాణ రూ.92,910 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.85,265 కోట్లు, కేరళ రూ.71,833 కోట్లుగా ఉంది. స్థూల జేడీపీలో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. అయిదు రాష్ట్రాలు 30 శాతం మేర తమ వాటాను సమకూరుస్తున్నాయి. మిగిలిన 25 రాష్ట్రాల వాటా 70 శాతంగా నమోదైంది. తెలంగాణలో ఆదాయం..ఆర్దిక వృద్ధి లో అగ్రబాగాన నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం - అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది. పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. తలసరి వృద్ధి రేటులోనూ దూసుకెళ్తోంది.












Click it and Unblock the Notifications