తెలంగాణలో హోం ఓటింగ్ విజయవంతం: ఎన్ని వేల మంది ఓటు వేశారంటే?
తెలంగాణలో ఎన్నికల సంఘం మొదతిసారి అమలు చేసిన హోం ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు కొన్ని సార్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేకపోయేవారు. కానీ, ఇప్పుడు ఇంటి నుంచి ఓటు ద్వారా వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండున్నర వేల మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసి ఆనందం వ్యక్తం చేశారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగుల నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో 2,360 మంది దరఖాస్తు చేసుకోగా.. నవంబర్ 23, 24, 25 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహించారు.

ఎన్నికల సిబ్బంది, బీఎల్వో, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు. 2,360 మందిలో 2,091 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో 80 ఏళ్ల పైబడిన వాళ్లు 1310 మందిఉండగా.. 12,008 మంది ఓటు వేశారు. దివ్యాంగులు 1050 మంది ఉండగా.. 1041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోవైపు, ఆర్మూర్ నియోజకవర్గంలో 281 మంది వృద్ధులు, 205 మంది దివ్యాంగులు, బోధన్ నియోజకవర్గంలో 173 మంది వృద్ధులు, 74 మంది దివ్యాంగులు, నిజామాబాద్ అర్బన్‌లో 53 మంది వృద్ధులు, 13 మంది దివ్యాంగులు, నిజామాబాద్ గ్రామీణంలో 151 మంది వృద్ధులు, 179 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో 331 మంది వృద్ధులు, 329 మంది దివ్యాంగులు, బాన్సువాడలో 235 మంది వృద్ధులు, 241 మంది దివ్యాంగులు తమ ఓటు వేశారు. మరోవైపు, కామారెడ్డి జిల్లాలో సైతం 542 మంది 80ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతంపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 495 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 171 మంది, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 201మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 123 మంది ఓటేశారు. ఇక, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications