TSPSC Paper leak: సీబీఐ చేతికి- షర్మిల డిమాండ్..
సంచలనం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్టీపీ ఇవ్వాళ హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన చేపట్టింది. దీనిపై సీబీఐ, సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ (TSPSC Paper leak) వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుకుంటోందనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. పరీక్షలను సజావుగా నిర్వహించడంలో కేసీఆర్ (KCR) సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR)- దీనికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ డిమాండ్ చేస్తోన్నాయి.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper leak)పై సీబీఐ (CBI)తో దర్యాప్తు జరిపించాలంటూ తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందనేది ఎవరికీ తెలియదని, దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులను ప్రజల ముందుకు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కుట్ర ప్రకారమే పేపర్లను లీక్ చేశారనేది ఇక్కడ స్పష్టమౌతోందని మండిపడ్డారు.

ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉందని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయింది. పేపర్ లీక్ ఉదంతానికి నిరసన తెలియజేయడానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ (Hyderabad) లోటస్ పాండ్ నివాసంలో ఆమెను నిర్బంధించారు. ఇంటి నుంచి బయటికి రావడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనితో ఆమె అక్కడే బైఠాయించారు. నిరసన ప్రదర్శన తెలిపారు.

కేటీఆర్ (KTR) రాజీనామా చేయాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్లను అమ్ముకున్న తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని, అది సరిపోదని వైఎస్ షర్మిల అన్నారు. సిట్ కు బదులుగా సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జీతో కూడా పేపర్ లీక్ పై దర్యాప్తు జరిపించాలని చెప్పారు. తనకు, తన ప్రభుత్వానికి అనుకూలంగా లేని ఏ నివేదికలను కూడా కేసీఆర్ (KCR) పట్టించుకోరని, ఇక్కడ ప్రభుత్వమే సిట్ ను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు.

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలేవీ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలను నిర్వహించానని, క్షేత్రస్థాయిలో తమ పార్టీ ప్రజల మనస్సును గెలుచుకుందని, తమకు కూడా ఆందోళనలు చేపట్టడానికి అనుమతులు ఇవ్వట్లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications